శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : సోమవారం, 26 ఏప్రియల్ 2021 (19:45 IST)

కరోనా విజృంభణ.. ఏపీలో లాక్‌డౌన్.. పూర్తి స్తాయి లాక్‌డౌన్‌పై ఇంకా..?

దేశంలో కరోనా మహమ్మారి ప్రళయం సృష్టిస్తోంది. లక్షల్లో కొత్త కేసులు, వేలల్లో మరణాలు నమోదవుతున్నాయి. ఇక ఏపీలోనూ కరోనా సెకండ్ వేవ్ బీభత్సం కొనసాగుతోంది. వేలల్లో కొత్త కేసులు నమోదవుతున్నాయి. 
 
ఆస్పత్రులు కరోనా రోగులతో నిండిపోతున్నాయి. కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. ఇతర రాష్ట్రాల తరహాలోనే ఏపీలోనూ లాక్‌డౌన్ విధించే అవకాశం లేకపోలేదనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 
 
అయితే రాష్ట్రంలో లాక్‌డౌన్ విధించే అవకాశం లేదని గతంలో అనేకసార్లు తెలిపిన ఏపీ మంత్రులు.. ఈసారి మాత్రం అందుకు కాస్త భిన్నగా స్పందించారు. కరోనా తీవ్రతపై సమీక్ష నిర్వహించిన ఏపీ డిప్యూటీ సీఎం, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని.. పూర్తిస్థాయి లాక్‌డౌన్ విధించే అంశంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
 
పూర్తి స్తాయి లాక్‌డౌన్‌పై కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంకా మార్గదర్శకాలు రాలేదని తెలిపారు. ఒకవేళ అలాంటి మార్గదర్శకాలు వస్తే సీఎం జగన్ నిర్ణయం తీసుకుంటారని వెల్లడించారు. ప్రభుత్వాస్పత్రుల్లో రెమిడెసివర్ ఇంజక్షన్ల కొరత లేదని స్పష్టం చేశారు. 
 
ప్రైవేట్ ఆస్పత్రుల్లో రెమిడెసివర్ కొరత లేకుండా చూస్తామని పేర్కొన్నారు. ఆక్సిజన్ వృథా కాకుండా మెడికల్ ఆఫీసర్లు దృష్టి పెట్టాలని ఆదేశించారు. ప్రతి నియోజకవర్గంలో కోవిడ్ సెంటర్‌ ఏర్పాటు చేస్తామన్నారు. 104కు కాల్ చేసిన మూడు గంటల్లో బెడ్‌ కేటాయించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆళ్ల నాని ఆదేశించారు.