1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : సోమవారం, 26 ఏప్రియల్ 2021 (10:12 IST)

దేశంలో కోవిడ్ విలయతాండవం.. మినీ లాక్‌డౌన్

కరోనా వైరస్ సెకండ్ వేవ్ దేశవ్యాప్తంగా విలయతాండవం చేస్తుంది. ఈ నేపధ్యంలో కరోనా వైరస్ వ్యాప్తి కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆంక్షలకు మరింత కఠినం చేయనుంది. గత వారం రోజుల్లో పాజిటివిటీ రేటు 10 దాటినా ఆక్సిజన్‌, ఐసీయూ పడకల భర్తీ 60 శాతం మించిన ప్రాంతాల్లో మినీ లాక్‌డౌన్‌ తరహాలో ఆంక్షలను కఠినంగా అమలు చేయాలని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ రాష్ట్రాలకు ఉత్తర్వులు జారీ చేసింది.
 
ప్రాంతాలను పట్టణాలు, నగరాలు, జిల్లాలు, పాక్షిక పట్టణ ప్రాంతాలు, మున్సిపల్‌ వార్డులు, పంచాయతీ ప్రాంతాలుగా వర్గీకరించి కఠిన నిబంధనలతో స్థానికంగా కట్టడి చర్యలు చేపట్టాలని ఆదేశించింది. ఆయాప్రాంతాల్లో రాత్రి కర్ఫ్యూ విధించడంతో పాటు, అత్యవసర కార్యకలాపాలు మినహా మిగిలిన అన్నింటిపైనా ఆంక్షలు విధించాలని స్పష్టం చేసింది.
 
వైరస్‌ సోకిన వారు స్వయంగా వెల్లడించేలా విస్తృత ప్రచారం, హెచ్చరిక సంకేతాలు ఇవ్వాలని సూచించింది. పరీక్షలు, సౌకర్యాలపై విస్తృత ప్రచారం చేయాలని కేంద్ర తెలిపింది. కరోనా పరీక్షలు ఎక్కడ చేయించుకోవాలి? వైద్య సౌకర్యాలు ఎక్కడెక్కడ అందుబాటులో ఉన్నాయి? అంబులెన్స్‌ల సమాచారంపై విస్తృత ప్రచారం చేయాలని కేంద్ర సూచించింది. వేగంగా సమాచారం అందించడానికి వాట్సప్‌ గ్రూపులు ఏర్పాటు చేయాలి. అవసరమైన వారికి వైద్యసేవలు అందించడంలో జాప్యం లేకుండా చూడాలి తెలిపింది.