గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 25 ఏప్రియల్ 2021 (17:28 IST)

నిద్రమత్తు వీడిన కేంద్రం : పీఎం కేర్ నిధులతో ఆక్సిజన్ ప్లాంట్లు

కేంద్రం ఇప్పటికి నిద్రమత్తు వీడింది. గత యేడాది కరోనా వైరస్ నేర్పిన గుణపాఠాలను పెద్దగా పట్టించుకోలేదు. కానీ, రెండో దశ కరోనా వైరస్ వ్యాప్తిలో కేంద్రం ఏ విధంగా నడుచుకుందే తేటతెల్లమైపోయింది. దేశవ్యాప్తంగా ఆక్సిజన్‌ సంక్షోభం నెలకొన్నది. 
 
నిత్యం పెరుగుతూ వస్తున్న కేసులతో ప్రాణవాయువుకు తీవ్ర కొరత ఏర్పడుతున్నది. ఇప్పటికే పలువురు ఆక్సిజన్‌ లభించక మృత్యువాతపడ్డారు. ఈ క్రమంలో మెడికల్‌ ఆక్సిజన్‌ కొరత పరిష్కారానికి కేంద్రం చర్యలు ఇపుడు చేట్టింది. 
 
దేశవ్యాప్తంగా హాస్పిటళ్లలో ప్రత్యేకంగా 551 మెడికల్‌ ఆక్సిజన్‌ ఉత్పత్తి ప్లాంట్లను నెలకొల్పనుంది. ఈ మేరకు నిధుల కేటాయింపునకు ప్రధాని కేర్స్‌ ఫండ్‌ ఆదివారం సూత్రప్రాయంగా ఆమోదం తెలిపినట్లు పీఎంఓ ఒక ప్రకటనలో తెలిపింది.
 
ఈ ప్లాంట్లను రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని జిల్లా ప్రధాన కార్యాలయాల్లో ఏర్పాటు చేయనున్నారు. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ప్లాంట్ల ఏర్పాటు జరుగుతుందని పీఎంఓ పేర్కొంది. 
 
ప్లాంట్ల ఏర్పాటుతో జిల్లాల్లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆక్సిజన్‌ సరఫరాలో ఆకస్మాత్తుగా అంతరాయం లేకుండా వీలు కలుగనుంది. కొవిడ్‌ రోగులతో పాటు ఇతర రోగులందరికీ నిరంతరం ఆక్సిజన్‌ అందుబాటులో ఉంటుంది.