కైలాస ద్వీపంలోకి భారతీయుల రాకపై నిషేధం.. నిత్యానంద
వివాదస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద మరోసారి వార్తల్లో నిలిచారు. కర్ణాటకలో ఆశ్రమం నిర్వహించే నిత్యానందపై మహిళా భక్తుల నుంచి లైంగిక దాడి, లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. దీంతో దేశం నుంచి పారిపోయిన ఆయన 2019 నుంచి ఈక్వెడార్ తీరంలో ఉన్న ద్వీపంలో దాగి ఉన్నట్లు తెలుస్తుంది. దీనికి కైలాస దేశంగా పేరు పెట్టడంతో పాటు ప్రత్యేక చట్టాలను రూపొందించారు. కైలాసను ప్రత్యేక దేశంగా గుర్తించాలని ఐక్యరాజ్య సమితికి కూడా విజ్ఞప్తి చేశారు.
తాజాగా తన దేశంగా ప్రకటించుకున్న కైలాస ద్వీపంలోకి భారతీయుల రాకపై నిషేధం విధించారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో బ్రెజిల్, ఐరోపా యూనియన్, మలేషియాతోపాటు భారత్ నుంచి భక్తులు, పర్యాటకుల రాకపై తదుపరి ఆదేశాల వరకు నిషేధం విధించినట్లు తెలిపారు. కైలాస రాష్ట్రపతి ఆదేశం పేరుతో ఈ మేరకు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌ను జారీ చేశారు. ఈ మేరకు ట్విట్టర్‌లో పేర్కొన్నారు.