మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 25 ఏప్రియల్ 2021 (17:09 IST)

రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికే కరోనా టీకాలు : తేల్చిచెప్పిన కేంద్రం

మే ఒకటో తేదీ నుంచి దేశంలో 18 యేళ్లు నిండిన 45 యేళ్లలోపు వారికి కరోనా టీకాలు వేయనున్నారు. అయితే, ఈ వయసుగలవారు వ్యాక్సిన్ కోసం CoWIN వెబ్‌పోర్ట‌ల్‌లో త‌ప్ప‌నిసరిగా రిజిస్ట్రేష‌న్ చేసుకోవాల‌ని అధికార వ‌ర్గాలు స్ప‌ష్టం చేశాయి. 
 
నేరుగా వెళ్లి వ్యాక్సిన్ తీసుకోవ‌డం కుద‌ర‌ద‌ని తెలిపాయి. 45 ఏళ్ల పైన ఉన్న వాళ్లు మాత్రం వ్యాక్సినేష‌న్ కేంద్రంలోనే రిజిస్ట్రేష‌న్ చేసుకొని అప్ప‌టిక‌ప్పుడు వ్యాక్సిన్ తీసుకోవ‌చ్చ‌ని అధికారులు స్ప‌ష్టం చేశారు.
 
18 ఏళ్లు నిండిన అంద‌రికీ అంటే ఒక్క‌సారిగా వ్యాక్సిన్‌కు డిమాండ్‌కు పెరిగే అవ‌కాశం ఉంది. ఒకేసారి అంద‌రూ వ్యాక్సిన్ కేంద్రాల‌కు రాకుండా.. CoWIN పోర్ట‌ల్‌లో అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవ‌డం త‌ప్ప‌నిస‌రి చేశాము. 
 
క‌నీసం ప్రారంభంలో అయితే నేరుగా వ‌చ్చే వాళ్ల‌కు వ్యాక్సిన్ వేయ‌డం కుద‌రదు అని ఓ సీనియ‌ర్ అధికారి చెప్పారు. ఈ నెల 28 నుంచి ఆరోగ్య సేతు యాప్‌, CoWINల‌లో వ్యాక్సిన్ రిజిస్ట్రేష‌న్ ప్ర‌క్రియ ప్రారంభ‌మ‌వుతుందని కేంద్ర వర్గాలు వెల్లడించాయి. 
 
ఇదిలావుంటే, కొవిడ్‌ వ్యాక్సినేషన్‌లో భారత్‌ రికార్డు సాధించింది. ప్రపంచంలోనే వేగంగా టీకాలు పంపిణీ చేస్తున్న దేశాల్లో భారత్​ అగ్రస్థానంలో నిలిచింది. కేవలం 99 రోజుల్లోనే 14 కోట్ల వ్యాక్సిన్ డోసులు​ అందించడం ద్వారా ఈ ఘనత సాధించినట్లు కేంద్రం పేర్కొంది. 
 
శనివారం రాత్రి రాత్రి 8 గంటల వరకు దేశవ్యాప్తంగా 14,08,02,794 మోతాదులు పంపిణీ చేసినట్లు కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది. ఇందులో 92.89లక్షల మంది హెల్త్‌ కేర్‌ వర్కర్లకు మొదటి డోసు, 59.94లక్షల మందికి రెండో డోసు, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు 1.19 మొదటి మోతాదు, 62.77లక్షల డోసులు రెండో మోతాదు అందించినట్లు చెప్పింది. 45-60 వయస్సు వారికి 4.76 కోట్లు మొదటి డోసు, 23.22 మందికి రెండో మోతాదు అందించినట్లు చెప్పింది.
 
60 ఏళ్లు పైబడిన వ్యక్తుల్లో 4.96 కోట్ల మందికి మొదటి డోసు, 77.02లక్షల మందికి రెండో డోసు వేసినట్లు వివరించింది. ప్రపంచంలోనే తొలిసారిగా మెగా టీకా డ్రైవ్‌ దేశంలో ఈ ఏడాది జనవరి 16న ప్రారంభమైన విషయం తెలిసిందే. 
 
మొదట హెల్త్‌ కేర్‌ వర్కర్‌ ఆ తర్వాత ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు, వృద్ధులకు ప్రాధాన్యం ఇచ్చింది. అనంతరం 45 ఏళ్లుపైబడి దీర్ఘకాలిక సంబంధ వ్యాధులతో బాధపడుతున్న వారికి వ్యాక్సిన్‌ వేస్తూ వస్తోంది. మే ఒకటో తేదీ నుంచి 18 ఏళ్లుపైబడిన వారికి టీకాలు వేయనుంది. 
 
ప్రస్తుతం దేశంలో కొవిషీల్డ్‌, కొవాగ్జిన్‌ వ్యాక్సిన్లను అత్యవసర వినియోగం కింద కేంద్రం వినియోగిస్తోంది. తాజాగా స్పుత్నిక్‌ వీ, జైడస్‌ క్యాడిలా ‘విరాఫిన్‌’ వ్యాక్సిన్‌కు డీసీజీఐ అనుమతి ఇచ్చింది. ఈ రెండు వ్యాక్సిన్లు సైతం అందుబాటులోకి వస్తే టీకా పంపిణీ మరింత వేగవంతం కానున్నది.