బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 27 డిశెంబరు 2020 (18:50 IST)

మా వ్యాక్సిన్ వంద శాతం సురక్షితం.. ఆస్ట్రాజెనెకా సీఈవో

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు పలు వ్యాక్సిన్లు సిద్ధమవుతున్నాయి. ఇందులో ఒకటి ఆస్ట్రాజెనెకా, ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ తయారు చేసిన కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఒకటి. ఇది విజయవంతంగా ట్రయల్స్ పూర్తిచేసుకుని ప్రస్తుతం బ్రిటన్, అమెరికా వంటి దేశాల్లో వినియోగిస్తున్నారు. 
 
ఈ క్రమంలో తమ వ్యాక్సిన్ వంద శాతం సురక్షితమని బ్రిటిష్ కంపెనీ ఆస్ట్రాజెనెకా సీఈవో పాస్క‌ల్ సోరియోట్ ప్రకటించారు. అంతేకాకుండా, వ్యాక్సిన్ సామ‌ర్థ్యాన్ని పెంచే ఆ విన్నింగ్ ఫార్ములాను ఆస్ట్రాజెనెకా, ఆక్స్‌ఫ‌ర్డ్ యూనివ‌ర్సిటీ సాధించాయ‌ని తెలిపారు. 
 
ప్ర‌స్తుతం బ్రిట‌న్ డ్ర‌గ్ రెగ్యులేట‌ర్ ఈ వ్యాక్సిన్ సామ‌ర్థ్యాన్ని ప‌రీక్షిస్తోంది. హాస్పిటల్‌లో చికిత్స అవ‌స‌ర‌మైన తీవ్రమైన కొవిడ్ విష‌యంలో త‌మ వ్యాక్సిన్ 100 శాతం సుర‌క్షిత‌మని ఆయన ఓ పత్రికకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో వెల్లడించారు. 
 
ఫైజ‌ర్‌ - బ‌యోఎన్‌టెక్ వ్యాక్సిన్ సాధించిన 95 శాతం, మోడెర్నా చెప్పిన 94.5 శాతం సామ‌ర్థ్యాన్ని త‌మ వ్యాక్సిన్ కూడా ట్ర‌య‌ల్స్‌లో అందుకుంటుంద‌న్నారు. వ్యాక్సిన్ సామ‌ర్థ్యానికి సంబంధించి ఇత‌రుల ద‌గ్గ‌ర ఉన్న ఆ విన్నింగ్ ఫార్ములాను ఇప్పుడు తాము కూడా ప‌ట్టేశామ‌ని తెలిపారు. 
 
ఇదిలావుంటే, ఆక్స్‌ఫర్డ్ - ఆస్ట్రాజెనికా - సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా కలిసి తయారు చేస్తున్న కొవిషీల్డ్ ను ఆమోదించే అవకాశం ఉందంటున్నారు. ఆక్స్‌ఫర్డ్ కరోనా టీకాకు బ్రిటన్ ఔషధ నియంత్రణ సంస్థ ఆమోదం తెలిపిన వెంటనే.. సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ) సమావేశమవుతుందని, వ్యాక్సిన్ భద్రత, రోగనిరోధకత డేటాలను విశ్లేషించి నిర్ణయం తీసుకుంటుందని కేంద్ర వర్గాలు పేర్కొన్నాయి. 
 
అయితే, భారత్ బయోటెక్ తయారు చేస్తున్న కొవ్యాగ్జిన్ టీకా మూడో దశ ప్రయోగాలు జరుగుతున్నందున, దానికి అనుమతులొచ్చేందుకు కొంత సమయం పట్టే అవకాశాలున్నాయన్నారు. ఫైజర్ కూడా అనుమతులకు దరఖాస్తులు చేసిందన్నారు. అయితే, వ్యాక్సిన్‌కు సంబంధించిన ట్రయల్స్‌పై కంపెనీ ఇంకా సమాచారాన్ని ఇవ్వాల్సి ఉందని చెప్పారు. 
 
వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుంటే ఇప్పటికే అడ్వాన్స్ దశలో ఉన్న కొవిషీల్డ్‌కే ప్రభుత్వం మొగ్గు చూపే అవకాశం ఉందని వివరించారు. వ్యాక్సిన్ భద్రత, ట్రయల్స్ సమాచారాన్ని ఇదివరకే డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ)కు ఇచ్చింది.