సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 2 మార్చి 2020 (17:14 IST)

ప్రపంచంపై కరోనా వైరస్ పంజా .. బిల్ గేట్స్ ఇచ్చిన సలహా ఏంటి?

ప్రపంచంపై కరోనా వైరస్ పంజా విసిరింది. అనేక దేశాల్లో ఈ వైరస్ సోకింది. ఫలితంగా అనేక మంది మృత్యువాతపడ్డారు. ఈ క్రమంలో మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ స్పందించారు. ఇలాంటి వైరస్‌లు శతాబ్దానికి ఒకసారి వస్తుంటాయని అభిప్రాయపడ్డారు. ఇలాంటి సందర్భాల్లోనే ప్రస్తుత ప్రజలను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. 
 
దీనిపై ఆయన స్పందిస్తూ, కరోనా తరహా వ్యాధులు శతాబ్దానికి ఒకసారి మాత్రమే సంభవిస్తుంటాయని, అయితే ఈ వైరస్ మానవాళి మనుగడకే ముప్పులా పరిణమిస్తుందని తాను భావించడంలేదని తెలిపారు. ప్రస్తుతం దీన్ని ఎలా ఎదుర్కోవాలన్న దానిపై ప్రపంచ దేశాలు దృష్టి పెట్టాలని సూచించారు. 
 
రెండు అంశాల ప్రాతిపదికన కరోనాను ఎదుర్కోవాలని తెలిపారు. సమస్యను తక్షణమే పరిష్కరించడం మొదటిదైతే, భవిష్యత్తులో మళ్లీ రాకుండా చూడడం రెండోదని అన్నారు. ప్రస్తుతం మొదటి అంశమే కీలకమని, ముందు ప్రజలను రక్షించుకోవాల్సి ఉందని గేట్స్ అభిప్రాయపడ్డారు. రెండో అంశంపై దీర్ఘకాలిక చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
 
ప్రభుత్వాలు, ఆరోగ్య వ్యవస్థలు సమర్థంగా చర్యలు తీసుకుని వైరస్ వ్యాప్తిని అరికట్టాలని సూచించారు. పేద, మధ్య తరహా దేశాలకు సంపన్న దేశాలు సాయం చేయాల్సిన తరుణం ఇదేనని, ధనిక దేశాల్లో ఇలాంటి వైరస్ పర్యవసానాలను ఎదుర్కొనే బలమైన వ్యవస్థలు ఉంటాయి కాబట్టి, పేద దేశాలకు కూడా చేయూతనివ్వాలని పిలుపునిచ్చారు.