కరోనా వైరస్‌తో మేలు జరిగిందా? ఎలా?
కరోనా వైరస్ కారణంగా చైనాకు చుక్కలు కనిపించాయి. కరోనా ప్రభావంతో జనాలు ఇళ్లలోంచి బయటికి రావడమే మానేశారు. ప్రభుత్వం కూడా అనేక ఆంక్షలు విధించింది. దీంతో అక్కడి పారిశ్రామిక రంగం కుంటుపడింది. ఇది చైనా ఆర్థికవృద్ధిని కుంగదీసినప్పటికీ.. వాయు కాలుష్యం మాత్రం మునుపెన్నడూ లేని స్థాయిలో తగ్గింది. తాజాగా నాసా వాయు కాలుష్యానికి సంబంధించిన ఫోటోలను విడుదల చేసింది.
ఈ ఫోటోలు వాయు కాలుష్యానికి కారణమయ్యే నైట్రోజన్ డయాక్సైడ్‌కి సంబంధించింది. మోటార్ వాహనాలు, విద్యుత్ కేంద్రాలు, ఇతర కర్మాగారాలు ఈ గ్యాస్‌ను అధికమొత్తంలో విడుదల చేస్తుంటాయి. ఈ చిత్రాల ప్రకారం.. జనవరి మధ్య చైనా దేశ వాతావరణంలో నైట్రోజన్ డయాక్సైడ్ పరిమాణం అధిక స్థాయిలో ఉండగా.. ఫిబ్రవరి నెలలో దీనిస్థాయి భారీగా తగ్గిపోయింది.
వైరస్ కేంద్రమైన వూహాన్ నగరంలో తొలుత నైట్రోజన్ స్థాయిలు తగ్గడం ప్రారంభించాయి. ఆ తరువాత.. ఆర్థిక రంగం నెమ్మదించే కొద్ది.. బీజింగ్, షాంఘాయ్ వంటి నగరాల్లోనూ వాయు కాలుష్యం భారీగా తగ్గిపోయింది. కరోనా కారణంగా వాయు కాలుష్యం ఈ స్థాయికి తగ్గుతుందని తాను భావించట్లేదని నాసా పరిశోధకులు చెప్తున్నారు.