సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 19 నవంబరు 2020 (21:46 IST)

కరోనా వైరస్ విస్తరణ పైన సీఎం జగన్ ఆందోళన, ఎందుకో తెలుసా?

ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా వైరస్ ప్రస్తుతం అనేక దేశాల్లో రెండో దశ సంక్రమణ (వ్యాప్తి) మొదలైంది. ముఖ్యంగా, అగ్రరాజ్యం అమెరికాతో యూరప్ దేశాల్లో సెకండ్ వేవ్ మొదలైంది. దీంతో ఆయా దేశాల ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఈ క్రమంలో ఫ్రాన్స్, లండన్‌లలో షట్ డౌన్ విధించారు. మన దేశంలో ఢిల్లీలో మళ్లీ కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
 
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీ మరో లాక్డౌన్ దిశగా అడుగులు వేస్తోందని జగన్ అన్నారు. అనేక దేశాల్లో సెకండ్ వేవ్ నడుస్తోందని చెప్పారు. అక్కడ ప్రారంభమైన వెంటనే మన దేశంలో కూడా అదే జరుగుతోందన్నారు. 
 
అందువల్ల మనకు కూడా సెకండ్ వేవ్ రాబోతోందని చెప్పారు. స్కూళ్లు, కాలేజీలు తెరుస్తున్నాం కాబట్టి జిల్లా కలెక్టర్లు శ్రద్ధ తీసుకోవాలని అన్నారు. పిల్లల ఆరోగ్యం కోసం అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
 
డిసెంబర్ 25న డీ-ఫామ్ ఇస్తూ ఇంటి స్థలం పట్టాలను ఇస్తామన్నారు. కోర్టు స్టే ఉన్న చోట్ల మినహా ఇతర ప్రాంతాల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టబోతున్నామన్నారు. ప్రతిపక్షం కుటిల రాజకీయాలకు పాల్పడుతోందని... అందువల్లే ఇంటి స్థలాలు ఇవ్వడం కోసం న్యాయ పోరాటం చేయాల్సి వస్తోందని చెప్పారు. 
 
టీడీపీ హయాంలో పారిశ్రామికవేత్తలకు వేలాది ఎకరాలను కట్టబెట్టారని... ఇప్పుడు పేదలకు సెంటు, సెంటున్నర స్థలం ఇస్తామంటే అడ్డుకుంటున్నారని దుయ్యబట్టారు. దేవుడు మనకు అండగా ఉన్నాడని... ఈ యుద్ధంలో మనమే గెలుస్తామని అన్నారు. 
 
మరోవైపు, ఏపీలో కరోనా ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. గత 24 గంటల్లో 75,165 మంది శాంపిల్స్‌ని పరీక్షించగా 1,316 మందికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ఈ కేసులతో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 8,58,711కి పెరిగింది. 
 
కరోనా చికిత్స పొందుతూ గత 24 గంటల్లో 11 మంది మరణించారు. దీంతో ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 6,910కి పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 16,000 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. గత 24 గంటల్లో 1,821 మంది కరోనా నుంచి కోలుకున్నారు.