శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 5 నవంబరు 2020 (15:23 IST)

సీఎం కార్యాలయ ఉద్యోగి పెళ్లికి వచ్చిన వైఎస్. జగన్ దంపతులు..

ముఖ్యమంత్రి కార్యాలయంలో ఆఫీస్ సబార్డినేట్‌గా పనిచేస్తున్న బి.రవిప్రసాద్ అనే ఉద్యోగి వివాహానికి సీఎం జగన్ సతీసమేతంగా హాజరయ్యారు. తాడేపల్లి సీఎస్ఆర్ కల్యాణమంటపంలో ఈ పెళ్లి జరిగింది. ఈ వివాహ కార్యక్రమానికి సీఎం జగన్, వైఎస్ భారతి విచ్చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ వధూవరులను ఆశీర్వదించారు. వారికి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. సీఎం దంపతుల రాకతో పెళ్లి మంటపంలో సందడి మరింత అధికమైంది.
 
నిజానికి ముఖ్యమంత్రి అంటే రోజుకుమ 24 గంటలు సరిపోని పదవి. రాష్ట్ర వ్యవ‌హారాల‌తోపాటు అధికారుల స‌మ‌న్వ‌యం.. ఇలా ప్ర‌తి నిముషం బిజీ, బిజీగా గడుపుతుంటారు. అయితే ఇంత‌టి బిజీ టైమ్‌లోనూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన చుట్టూ ఉన్నవాళ్ల మంచి, చెడులను తెలుసుకుంటూ గొప్ప మనసును చాటుకుంటున్నారు.
 
దీనికి నిదర్శనమే గురువారం ఆయన ముఖ్యమంత్రి కార్యాలయంలో ఆఫీస్‌ సబార్డినేట్‌గా పనిచేస్తున్న రవి ప్రసాద్‌ వివాహానికి సతీ సమేతంగా హాజరుకావడం. ఈ వివాహా వేడుకకి సీఎం దంపతులతో పాటు డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆదిమూలపు సురేష్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు. తమ వివాహానికి ముఖ్యమంత్రి హాజరు కావడంపట్ల రవి ప్రసాద్‌తో పాటు కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.