గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఎం
Last Updated : మంగళవారం, 3 ఆగస్టు 2021 (10:33 IST)

దేశంలో 30 వేలకు తగ్గిన కరోనా కేసులు

గత కొద్ది రోజులుగా 40వేలకు పైగానే నమోదవుతోన్న కొత్త కేసులు ఒక్కసారిగా తగ్గాయి. ముందురోజు కంటే 24 శాతం క్షీణించి..30 వేలకు చేరాయి.

మృతుల సంఖ్యలో మాత్రం మార్పులేదు. అంతకుముందురోజు మాదిరిగానే 400పైగా మరణాలు వెలుగుచూశాయి. ఈ మేరకు మంగళవారం కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలను వెల్లడించింది.
 
తాజాగా 30,549 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. దాంతో మొత్తం కేసులు 3.17కోట్లకు చేరాయి. కేరళ, మహారాష్ట్రలో కొత్త కేసులు భారీగా పడిపోవడమే ఈ తగ్గుదలకు కారణం. అక్కడ వరుసగా 13,984, 4,869 కేసులు బయటపడ్డాయి.
 
నిన్న మరో 422 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు వైరస్‌ ధాటికి బలైనవారి సంఖ్య 4.25లక్షలుగా ఉంది. ఇటీవల క్రియాశీల కేసులు మళ్లీ నాలుగులక్షల మార్కును దాటాయి. ప్రస్తుతం 4,04,958 మంది కొవిడ్‌తో బాధపడుతన్నారు. క్రియాశీల రేటు 1.28 శాతంగా ఉంది. 
 
నిన్న 38,887 మంది కోలుకున్నారు. మొత్తం రికవరీలు 3.08కోట్లకు చేరగా.. ఆ రేటు 97.38 శాతంగా కొనసాగుతోంది. నిన్న 16,49,295 కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. దాంతో మొత్తం పరీక్షల సంఖ్య 47,12,94,789కి చేరిందని ఐసీఎంఆర్ వెల్లడించింది.
 
అలాగే నిన్న 61లక్షల మంది టీకా వేయించుకున్నారు. మొత్తంగా పంపిణీ అయిన డోసుల సంఖ్య 47,85,44,114కి చేరింది..