గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 27 మార్చి 2020 (20:19 IST)

కరోనా మరణమృదంగం : ఎవరిని బతికిస్తారో.. ఎవరిని చంపేస్తారో మీ యిష్టం!!

ప్రపంచంలో అన్న అందమైన దేశాల్లో అది ఒకటి. కానీ, ప్రస్తుతం ఆ దేశం శ్మశానవాటికను తలపిస్తోంది. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా చనిపోతున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. ఈ సంఖ్యలో చైనాను అధికమించింది. దీంతో శవాలను పాతిపెట్టేందుకు స్థలం లేక ఐస్ రింకుల్లో స్టోర్ చేస్తున్నారంటే పరిస్థితి ఎంత దిగజారిపోయిందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఆ దేశమే స్పెయిన్. కరోనా వైరస్ బారినపడినవారిలో తిరిగి కోలుకుంటారనే భావించే వారికి మాత్రమే వైద్యం చేస్తున్నారు. వయసు మళ్లిన వారికి వైద్యం చేయలేక చేతులెత్తేశారు. అంటే స్పెయిన్ ఎంత దుర్భరస్థితిలో ఉందో తెలుసుకోవచ్చు. 
 
స్పెయిన్ రాజధాని మాడ్రిడ్‌లో ఉన్న అతిపెద్ద ఆస్పత్రిలో పని చేసే చీఫ్ డాక్టర్లలో డానియేల్ బెర్నాబ్యూ ఒకరు. ఈయన తమ దేశంలో నెలకొన్న తాజా పరిస్థితిని కళ్లకు కట్టినట్టు వివరించారు. తమ ఆసుపత్రిలో కరోనా పాజిటివ్‌గా లోనికి వచ్చి, ఆసుపత్రిలో అడ్మిట్ కాకుండానే చనిపోతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. 
 
వీరి మృతదేహాలు వెయిటింగ్ రూమ్‌లో పెరుగిపోతున్నాయి. పలు ప్రాంతాల్లోని శ్మశాన వాటికల్లో స్థలాలు లేక, ఐస్‌రింక్‌ల్లో మృతదేహాలను స్టోర్ చేస్తున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చని తీవ్ర ఆవేదనతో చెప్పుకొచ్చారు. 
 
అంతేకాకుండా, ఆసుపత్రుల్లో ఇంటెన్సివ్ కేర్ యూనిట్ల (ఐసియు) నిబంధనలు కూడా మారిపోయాయి. కరోనా పాజిటివ్‌గా సోకి తొలుత వచ్చిన వయోవృద్ధులను పక్కనబెట్టి, రికవరీ చాన్స్‌లు అధికంగా ఉండే యువతను తొలుత లోనికి తీసుకెళుతున్నామని బెర్నాబ్యూ చెప్పారు. పైగా, కరోనా వైరస్ బారినపడినవారిలో ఎవరికి చికిత్స చేయాలి.. ఎవరిని వదిలివేయాలన్న విషయాన్ని వైద్యులకే వదిలివేసినట్టు చెప్పారు.
 
తప్పనిసరి పరిస్థితుల్లోనే దేశాన్ని రక్షించుకునేందుకు ఈ చర్య తప్పడం లేదని ఆయన తీవ్ర విషణ్ణవదనంతో చెప్పారు. "ఆయనో తాతయ్య. మరే విధమైన పరిస్థితి అయినా, ఆయన్ను బతికించేందుకు మొత్తం శ్రమించే వాళ్లం. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. ఆయన వయసువారే అందరూ. అందరూ ఒకేసారి మరణిస్తున్నారు" అని వ్యాఖ్యానించారు.
 
కాగా, స్పెయిన్‌లో తాజాగా మరో 738 మంది ప్రాణాలు కోల్పోగా, ఇక్కడ మరణాల సంఖ్య 4,089కి పెరిగాయి. అంటే చైనాను అధికమించిపోయింది. కరోనా వైరస్ వ్యాప్తిపై ప్రధాని పెడ్రో శాంచెజ్ మాట్లాడుతూ, ఇంత విపత్కర పరిస్థితి గతంలో ఎన్నడూ సంభవించలేదని అన్నారు.