మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఎం
Last Modified: గురువారం, 5 మార్చి 2020 (13:59 IST)

నేడు టాలీవుడ్ పెద్దల అత్యవసర సమావేశం... కొన్ని రోజులు సినిమా హాల్స్ మూత

కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో కొన్ని రోజుల పాటు సినిమా థియేటర్లను మూసివేయాలని సినీ పెద్దలు భావిస్తున్నట్టు తెలుస్తోంది. హైదరాబాద్ ఫిల్మ్ నగర్ లోని తెలుగు ఫిల్మ్ చాంబర్ కార్యాలయంలో సినీ పెద్దలు నేటి సాయంత్రం 4 గంటలకు అత్యవసర సమావేశం కానున్నారు. ఈ మీటింగ్‌కు హాజరు కావాలని పలువురు సీనియర్లకు నిన్న సాయంత్రమే మెసేజ్ వెళ్లింది. 
 
కరోనా ప్రభావంతో విదేశీ షూటింగ్‌లను వాయిదా వేసుకోవడం, కేసుల సంఖ్యను పెరిగే అంశాన్ని బట్టి, సినిమా హాల్స్ మూసివేత తదితర నిర్ణయాలు తీసుకోవచ్చని తెలుస్తోంది. కాగా, చైనాలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే థియేటర్లు మూతపడ్డాయి. సినిమా హాల్స్‌లో కిక్కిరిసిపోయే ప్రజల మధ్య వైరస్ ఒకరి నుంచి ఒకరికి సులువుగా సోకే ప్రమాదం ఉండటంతోనే చైనా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
 
ఇక టాలీవుడ్ హీరోలు, కరోనాపై ప్రజల్లో ఆందోళనను తొలగిస్తూ, ముందు జాగ్రత్త చర్యలు చెబుతూ ట్వీట్లు పెడుతున్నారు. ముఖానికి మాస్క్ ధరించిన ప్రభాస్, ఎయిర్‌పోర్టుకు వెళుతుంటే క్లిక్ మనిపించిన దృశ్యాలు వైరల్ అయ్యాయి. టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు తన సోషల్ మీడియా ఖాతాలో కరోనాపై ముందు జాగ్రత్తలు తీసుకోవాలని ట్వీట్ చేశారు.