మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 5 మార్చి 2020 (13:16 IST)

కరోనా వైరస్ అనుమానంతో వ్యక్తిమృతి.. అంత్యక్రియలు ఎలా చేశారంటే...

కరోనా వైరస్ లక్షణాలున్నాయన్న అనుమానంతో ఆస్పత్రిలో చేరిన ఓ వ్యక్తి ఐసోలేషన్ వార్డులోనే చనిపోయాడు. దీంతో అతని అంత్యక్రియల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. మృతదేహాన్ని నాలుగు ప్లాస్టిక్ కవర్లలో చుట్టి అంత్యక్రియలు చేశారు. ఈ ఘటన కేరళ రాష్ట్రంలోని పయ్యన్నూర్ పట్టణంలో వెలుగుచూసింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, పయ్యన్నూర్ పట్టణానికి చెందిన జైనేష్ (36) అనే వ్యక్తి తీవ్ర జ్వరం, కరోనా వైరస్ లక్షణాలతో ఇటీవల మలేషియా నుంచి కన్నూరుకు వచ్చాడు. జైనేష్ కేరళ విమానాశ్రయానికి రాగానే అతనికి వైద్యపరీక్షలు చేసి ఐసోలేషన్ వార్డుకు తరలించారు. అయితే, ఈ వార్డులోనే చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచాడు. 
 
జైనేష్ రక్తనమూనాలను పూణేలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీలో పరీక్షించగా అతనికి కరోనా వైరస్ లేదని తేలింది. అయినా జైనేష్‌కు కరోనా వైరస్ ఉందనే అనుమానంతో అతని మృతదేహాన్ని పలు పొరల వస్త్రంతోపాటు పాలిథీన్లతో చుట్టారు. కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితులు జైనేష్ మృతదేహాన్ని రెండు మీటర్ల దూరం నుంచే కడచూపు చూసేందుకు 10 నిమిషాల కంటే ఎక్కువ సమయం ఇవ్వకుండా కట్టుదిట్టమైన భద్రత మధ్య పలు పొరల పాలిథీన్ కవర్లలో చుట్టి ఆచారాలు పాటించకుండానే అంత్యక్రియలు పూర్తిచేశారు. 
 
అంతేకాకుండా, జైనేష్ మృతదేహాన్ని దహనం చేసిన అధికారులు కరోనా భయంతో చితాభస్మాన్ని కూడా ఇవ్వలేదు. నిపా వైరస్‌తో కేరళలో మరణించిన వారికి జరిపిన అంత్యక్రియలను జైనేష్ మృతదేహానికి జరిపిన అంత్యక్రియలతో తలపించారు. జైనేష్‌కు కరోనా వైరస్ లేదని రక్తపరీక్షల్లో తేలినా, అతనికి వ్యాధి లక్షణాలు ఉండటంతో ఎలాంటి అవకాశం తీసుకోకుండా అంత్యక్రియలు జరిపామని కేరళ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కేకే శైలజ వెల్లడించారు.