శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 2 ఏప్రియల్ 2021 (19:36 IST)

ఢిల్లీలో ఫోర్త్ వేవ్... అయినా లాక్డౌన్ విధించే ప్రసక్తే లేదు : సీఎం కేజ్రీవాల్

దేశంలో కరోనా వైరస్ రెండో దశ వ్యాప్తి శరవేగంగా సాగుతోంది. ముఖ్యంగా ఆరు రాష్ట్రాల్లో ఈ కేసు ప్రభావం ఎక్కువగా ఉంది. ఇలాంటి రాష్ట్రాల్లో ఢిల్లీ ఒకటి. గత 24 గంటల్లో 3,583 కొత్త కేసులు ఢిల్లీలో నమోదవ్వడంతో అక్కడి ప్రభుత్వం అప్రమత్తమైంది. 
 
ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అప్రమత్తమయ్యారు. తన మంత్రివర్గంతోపాటు.. ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. వైద్యశాఖ మంత్రి సత్యేందర్‌ జైన్‌, ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశంలోపాల్గొన్నారు.
 
ఆ తర్వాత సీఎం కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడుతూ, ఢిల్లీలో ప్రస్తుతం కరోనా నాలుగో వేవ్‌ కొనసాగుతోందన్నారు. అందుకే మళ్లీ రోజువారీ కేసులు పెరుగుతున్నాయన్నారు. అయితే, నగరంలో మరోసారి లాక్డౌన్‌ విధించే ఆలోచనేమీ లేదని స్పష్టంచేశారు. 
 
భవిష్యత్తులో అవసరమైతే ప్రజాభీష్టం మేరకు చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామన్నారు. ప్రస్తుతం కరోనా బాధితుల్లో ఎక్కువ మంది హోంక్వారంటైన్‌లోనే చికిత్స తీసుకుంటున్నారని తెలిపారు.
 
టీకా పంపిణీకి ఎలాంటి ఆంక్షలూ లేకుండా అందరినీ అనుమతించాలన్నారు. కేంద్రం అనుమతిస్తే ఢిల్లీ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన టీకా పంపిణీ చేపడుతుందన్నారు. 
 
ప్రస్తుతం ఢిల్లీలో కరోనా వైరస్ నాలుగో దశ వ్యాప్తి సాగుతోందని, దీన్ని నుంచి బయటపడేందుకు మాస్క్‌ ధరించడం, భౌతిక దూరం వంటి నిబంధనలను తప్పసరిగా పాటించాలని ప్రజలను కోరారు. గతంలో కరోనా విజృంభణతో పోలిస్తే నాలుగో వేవ్‌తో ముప్పు తక్కువేనని సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు.