మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 6 అక్టోబరు 2020 (10:45 IST)

దేశంలో 67 లక్షలకు చేరిన కరోనా కేసు - తెలంగాణాలో 1983

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గకపోగా మరింత ఎక్కువైపోతోంది. తాజాగా గడిచిన 24గంటల్లో 61,267 పాజిటివ్‌ కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. మరో 884 మంది వైరస్‌ ప్రభావంతో మరణించారని చెప్పింది. ప్రస్తుతం దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 66,85,083కు చేరాయి. 
 
అలాగే, ప్రస్తుతం 9,19,023 యాక్టివ్‌ కేసులు ఉండగా.. 56,62,491 మంది బాధితులు కోలుకొని ఇండ్లకు వెళ్లారు. ఇప్పటివరకు మహమ్మారి కారణంగా 1,03,569 మంది మృత్యువాతపడ్డారని మంత్రిత్వశాఖ తెలిపింది. సోమవారం ఒకే రోజు 10,89,403 శాంపిల్స్‌ పరీక్షించగా.. మొత్తం 8,10,71,797 నమూనాలను పరిశీలించినట్లు ఐసీఎంఆర్‌ వివరించింది.
 
ఇకపోతే, తెలంగాణ‌ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంగళవారం ఉదయం వెల్లడించిన కొవిడ్ 19 కేసుల వివరాల ప్ర‌కారం.. రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 1,983 కేసులు నమోదయ్యాయి. అదేసమయంలో పది మంది కరోనాతో ప్రాణాలు కోల్పోగా, 2,381 మంది కోలుకున్నారు.
 
ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,02,594కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 1,74,769 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 1,181కు చేరింది. ప్రస్తుతం 26,644 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. 
 
జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 292, రంగారెడ్డి జిల్లాలో 187 కేసులు నమోదయ్యాయి. కాగా, సోమవారం వరకు మొత్తం తెలంగాణలో 32,92,195 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. నిన్న ఒక్కరోజే 50,598 కరోనా నిర్ధారణ పరీక్షలు జరిపారు.