సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: సోమవారం, 5 అక్టోబరు 2020 (18:34 IST)

కరోనావైరస్: రాబోయే అయిదేళ్లలో బాల్య వివాహాలు కోట్ల సంఖ్యలో పెరుగుతాయా?

కరోనావైరస్ వ్యాప్తి నడుమ ప్రపంచ వ్యాప్తంగా బాల్య వివాహాలు విపరీతంగా పెరిగే ముప్పుందని ఓ స్వచ్ఛంద సంస్థ హెచ్చరిస్తోంది. మనం 25ఏళ్లుగా సాధించిన పురోగతి తిరోగమన బాట పట్టే అవకాశముందని సంస్థ పేర్కొంది.

 
కోవిడ్-19 వ్యాప్తి నడుమ 2025నాటికి 25 లక్షల మంది చిన్నారులు బాల్య వివాహాల బారినపడే అవకాశముందని సేవ్ ద చిల్డ్రన్ సంస్థ అంచనా వేసింది. ''కరోనావైరస్ వ్యాపించడంతో పేదరికం పెరుగుతోంది. దీంతో బాలికలు బడి మానేయాల్సి వస్తోంది. ఫలితంగా వారు పనులకు వెళ్లడం లేదా వారికి పెళ్లి చేసేయడం జరుగుతోంది''

 
భారత్ సహా దక్షిణాసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికాల్లోని బాలికలు ఈ ముప్పును ఎక్కువగా ఎదుర్కొంటున్నారు. బాల్య వివాహాలను అరికట్టేందుకు, లింగ సమానత్వాన్ని కాపాడేందుకు ప్రపంచ నాయకులు కదిలి రావాలని సంస్థ పిలుపునిచ్చింది.

 
''ఇలాంటి వివాహాలతో బాలికల హక్కులు ఉల్లంఘనకు గురవుతాయి. కుంగుబాటు ముప్పు పెరుగుతుంది. జీవితాంతం వారు గృహహింసకు బాధితులుగా మారుతారు. కొందరికి మరణ ముప్పు కూడా ఎక్కువవుతుంది''అని సేవ్ ద చిల్డ్రన్ అడ్వైజర్ కరేన్ ఫ్లానగన్ వ్యాఖ్యానించారు.

 
గత 25ఏళ్లలో 7.86 కోట్ల బాల్య వివాహాలను అరికట్టగలిగామని, కానీ ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే మళ్లీ బాల్య వివాహాలు పెరిగేలా కనిపిస్తున్నాయని ఆమె చెప్పారు. కరోనావైరస్ వ్యాప్తి నడుమ పాఠశాలలు మూతపడటం, ఆర్థిక వ్యవస్థలు మందగమనంలో కొనసాగడం తదితర చర్యల వల్ల బాల్య వివాహాలను అడ్డుకొనేందుకు చేస్తున్న ప్రయత్నాలకు ఆటకం కలుగుతోందని గర్ల్స్ నాట్ బ్రైడ్స్ సంస్థ గత నెలలో బీబీసీకి తెలిపింది.

 
విద్యతో బాలికల సంరక్షణ పెరుగుతుంది అని గర్ల్స్ నాట్ బ్రైడ్స్ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డాక్టర్ ఫెయిత్ వాంగి పోవెల్ చెప్పారు. బాలికలు పాఠశాలలకు వెళ్లేలా చూసేందుకు మరింత నిధులు, సామాజిక సాయం, పర్యవేక్షణ అవసరమని ఆమె వివరించారు.

 
ఈ సమస్య ఎంత పెద్దది?
ఏటా 1.2 కోట్ల మంది బాల్య వివాహాలకు బలవుతున్నట్లు సేవ్ ద చిల్డ్రన్ చెబుతోంది. అయితే, ఆర్థిక మందగమనం, కరోనావైరస్ వ్యాప్తి నడుమ వచ్చే ఐదేళ్లలో ఈ వివాహాలు గణనీయంగా పెరగబోతున్నాయని సంస్థ హెచ్చరించింది. ''2020లో ఐదు లక్షల మందికి బలవంతంగా పెళ్లి చేస్తున్నట్లు అంచనా. మరో పది లక్షల మంది చిన్న వయసులో గర్భం దాల్చబోతున్నారు''.

 
''ఎలాంటి చర్యలు తీసుకోకపోతే.. 2025నాటికి బాల్య వివాహాలు 6.1 కోట్లకు మించిపోతాయి. ఇవన్నీ అధికారిక గణాంకాలు మాత్రమే. నిజానికి ఈ వివాహాలు ఇంతకంటే ఎక్కువే ఉండొచ్చు''. ''కరోనావైరస్ వ్యాప్తితో చాలా కుటుంబాలు పేదరికం బారిన పడుతున్నాయి. దీంతో తమ కుటుంబాలకు సాయం చేసేందుకు బాలికలు బడి మానేయాల్సి వస్తోంది. అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిలు మళ్లీ పాఠశాలకు వెళ్లే అవకాశం చాలా తక్కువ''అని సంస్థ ప్రెసిడెంట్, సీఈవో బిల్ చాంబర్స్ తెలిపారు.

 
''ఆహారం కొరత, ఆర్థిక ఇబ్బందుల నడుమ కొంత మంది తల్లిదండ్రులకు వేరే ప్రత్యామ్నాయం లేక బాలికలను పెద్దవారికి ఇచ్చి పెళ్లి చేసేస్తుంటారు. ఫలితంగా లైంగిక హింస, లైంగిక దోపిడీ పెరుగుతాయి''. కరోనావైరస్ వల్ల వచ్చే దశాబ్దంలో 1.3 కోట్ల కంటే ఎక్కువే బాల్య వివాహాలు జరగబోతున్నాయని గత ఏప్రిల్‌లో ఐక్యరాజ్యసమితి వెల్లడించింది.

 
పెద్దవారి కోసం బాలికలు
తమ నివేదిక కోసం డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో రాజధాని కిన్‌షాసాలో నివసిస్తున్న బాలిక ఎస్తేర్‌తో సేవ్ ద చిల్డ్రన్ సంస్థ మాట్లాడింది. కోవిడ్-19కు కళ్లెం వేసేందుకు ఇక్కడ పాఠశాలలు, కొన్ని బహిరంగ ప్రాంతాలను మూసివేశారు. ప్రస్తుతం తమ కోళ్ల వ్యాపారాన్ని చూసుకోవడంలో తల్లికి ఎస్తేర్ సాయం చేస్తోంది. అయితే కరోనావైరస్ వ్యాప్తితో బాలికలపై చాలా ప్రభావం పడుతోందని ఆమె అంటోంది.

 
''మా ఇంటి పొరుగున ఉండే కొందరు బహిరంగ మార్కెట్‌లో తమ సరకులు అమ్ముకొనేవారు. ప్రస్తుతం ఆంక్షల నడుమ మార్కెట్ తెరవడం లేదు. దీంతో చేయడానికి ఏమీ ఉండటం లేదు. ఇంటిలోని వారికి భారంగా ఉండకుండా చూసేందుకు వయసులో తమ కంటే పెద్దవారిని అమ్మాయిలు పెళ్లి చేసుకోవాల్సి వస్తోంది''

 
చదువులో రాజీపడను
ఇథియోపియాకు చెందిన 16ఏళ్ల అబేనాతోనూ సేవ్ ద చిల్డ్రన్ సంస్థ మాట్లాడింది. వయసులో తమ కంటే పెద్దవారికి ఇచ్చి అమ్మాయిల్ని పెళ్లి చేయకుండా చూసేందుకు అబేనా ప్రయత్నిస్తోంది. అబేనాను ధనవంతుడైన ఓ చదువుకున్న, పెద్ద వయసు వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేయాలని ఆమె కుటుంబం భావిస్తోంది. అయితే, తాను చదువుకుంటానని కుటుంబంతో అబేనా తెగేసి చెప్పింది.
 
''ఒప్పుకొనేది లేదని చెప్పాను. చదువు విషయంలో నేను రాజీపడను. 18ఏళ్ల లోపు వయసు ఉండేటప్పుడు పెళ్లి చేయాలని భావిస్తే.. బాలికల హక్కులను ఉల్లంఘించడమే''. గ్లోబల్ గర్ల్‌హుడ్ రిపోర్ట్ 2020 పేరుతో సంస్థ ఓ నివేదికను విడుదల చేసింది. ప్రపంచ వ్యాప్తంగా బాలిలకపై కోవిడ్-19 వ్యాప్తితో పడే ప్రభావంపై దీనిలో చర్చించారు.
 
మానవతా సంక్షోభానికి ప్రభావితమయ్యే అమ్మాయిలకు బాల్య వివాహాల ముప్పు ఎక్కువగా ఉంటుంది
బాల్య వివాహాలు ఎక్కువగా జరిగే తొలి పది దేశాల్లో ఆర్థిక పరిస్థితులు ఒక మోస్తరుగానే ఉన్నాయి.
కోవిడ్-19 వ్యాప్తి నడుమ బాలికలు, యువతులు, మహిళలపై హింస పెరిగింది. ప్రతి పది మంది బాలికల్లో ఒకరు అత్యాచారం లేదా లైంగిక హింసను ఎదుర్కొంటున్నారు.