శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 26 అక్టోబరు 2020 (10:58 IST)

దేశంలో కొత్తగా 45 వేల కరోనా పాజిటివ్ కేసులు

దేశంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతోంది. గత 24 గంటల్లో 45,149 కొత్త కేసులు మాత్రమే నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 79,09,960కి పెరిగింది. మరోవైపు గత 24 గంటల్లో కరోనా కారణంగా 480 మంది ప్రాణాలు కోల్పోయారు. వీటితో కలిపి ఇప్పటివరకు మృతి చెందిన వారి సంఖ్య 1,19,014కి పెరిగింది.
 
ఇక 24 గంటల్లో 59,105 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశంలో 6,53,717 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు ఈ మహమ్మారి నుంచి 71,37,229 మంది కోలుకున్నారు. మరోవైపు, త్వరలోనే సెకండ్ వేవ్ ప్రారంభమయ్యే అవకాశం ఉందని కొందరు చెపుతున్న నేపథ్యంలో... కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతుండటం గమనార్హం. 

అలాగే, రాష్ట్రంలో క‌రోనా కేసులు క్ర‌మంగా త‌గ్గుతూ వ‌స్తున్నాయి. గ‌త 24 గంట‌ల్లో మ‌హమ్మారి నుంచి కొత్త‌గా 1432 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 2,11,912 మంది బాధితులు క‌రోనా నుంచి కోలుకున్నారు. 
 
కొత్త‌గా 582 పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. దీంతో ఇప్ప‌టివ‌ర‌కు న‌మోదైన క‌రోనా కేసుల సంఖ్య 2,31,834కు చేరింది.  గ‌త 24 గంట‌ల్లో మ‌రో న‌లుగురు మ‌ర‌ణించారు.

దీంతో క‌రోనా మృతులు 1311కు పెరిగారు. మొత్తం క‌రోనా కేసుల్లో 18,611 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇందులో 15,582 మంది బాధితులు హోం ఐసోలేష‌న్‌లో ఉన్నారు.   
 
దేవేంద్ర ఫడ్నవీస్‌కు కరోనా.. 
మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఇన్‌ఛార్జ్ దేవేంద్ర ఫడ్నవీస్‌కు కరోనా వైరస్ సోకింది. ఈ విషయాన్ని ఆయన స్వయంగా తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. 
 
లాక్డౌన్ నుంచి తాను ప్రతి రోజు పనిచేస్తున్నానని, భగవంతుడు తనకు కొంత విరామం ఇవ్వాలని అనుకున్నట్టు ఉన్నాడని, అందులో భాగంగానే తనకు కరోనా సోకినట్టు ఉందని ఫడ్నవీస్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. వైద్యుల సలహా మేరకు చికిత్స తీసుకుంటున్నట్టు పేర్కొన్నారు. తనతో కాంటాక్ట్ అయిన వారు కూడా కరోనా టెస్టు చేయించుకోవాలని ఫడ్నవీస్ సూచించారు. 
 
కరోనా వైరస్ సోకిన దేవేంద్ర ఫడ్నవీస్ త్వరగా కోలుకోవాలని నెటిజన్లు ఆకాంక్షిస్తున్నారు. అయితే, కొందరు నెటిజన్లు మాత్రం తనదైనశైలిలో జోకులు పేల్చుతున్నారు. వదిన చేతి అప్పడాలు తినాలని, పతంజలి కోర్నిల్ ట్యాబ్లెట్లు వాడాలని, గోమూత్రం తాగాలని సూచించారు. 
 
అలాగే, శివసేన నేత సంజయ్ రౌత్ స్పందించారు. ఫడ్నవీస్ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించిన రౌత్.. బయట కరోనా పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో ఆయనకు ఇప్పుడు అర్థమై ఉంటుందన్నారు. ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే ఇంటి నుంచి బయటకు వచ్చేందుకు భయపడుతున్నారంటూ ఇటీవల ప్రతిపక్ష బీజేపీ విమర్శలు గుప్పించిన నేపథ్యంలో సంజయ్ రౌత్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.