ఏపీలో ఒక్కసారిగా తగ్గిన కరోనా పాజిటివ్ కేసులు... కారణం?

apcorona
ఠాగూర్| Last Updated: ఆదివారం, 25 అక్టోబరు 2020 (17:24 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఒక్కసారి గణనీయంగా తగ్గిపోయాయి. ఆ తగ్గుదల కూడా ఏకంగా సగానికి సగం తగ్గిపోయాయి. కొన్ని రోజుల వరకు ఏపీని కరోనా వైరస్ తీవ్రంగా వణికించింది. ప్రతి రోజు 10 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి.

అయితే కొన్ని రోజుల నుంచి కొత్త కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. గత 24 గంటల్లో కొత్త కేసుల సంఖ్య 3 వేల కంటే దిగువకు వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 2,997 కేసులు నమోదయ్యాయి.

ఇదేసమయంలో 21 మంది ప్రాణాలు కోల్పోయారు. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 466 కేసులు నమోదు కాగా, ఐదుగురు చనిపోయారు. తాజా గణాంకాలతో కలిపి రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8,07,023కి పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 30,860 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మొత్తం 6,587 మంది మృతి చెందారు.

దేశంలో పెరిగిన రికవరీ రేటు...
దేశంలో కరోనా వైరస్ బారినపడి కోలుకుంటున్నవారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. అదేసమయంలో ఈ వైరస్ సోకి చనిపోతున్న వారి సంఖ్య కూడా బాగా తగ్గిపోయింది. ప్రస్తుతం రికవరీ రేటు 90 శాతం ఉండగా, మరణాల రేటు 1.51 శాతం మేరకు తగ్గింది.

మరోవైపు, గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 11,40,905 మందికి కరోనా పరీక్షలు చేయగా, 50,129 మందికి పాజిటివ్‌గా తేలింది. వీటితో కలుపుకుని దేశంలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 78,64,811కు పెరిగింది.

అలాగే, శనివారం ఒక్క రోజే 578 మంది కరోనా కాటుకు బలయ్యారు. ఫలితంగా ఇప్పటివరకు ఈ మహమ్మారి బారినపడి మృతి చెందినవారి సంఖ్య 1,18,534కు చేరుకుంది.

కరోనా నుంచి కోలుకున్న 62,077 మంది ఆదివారం డిశ్చార్జ్ కావడంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 70,78,123కు పెరిగింది. దేశంలో ఇంకా 6,68,154 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.

కరోనా బారినపడి కోలుకున్న వారిలో దాదాపు 90 శాతం కోలుకుంటున్నట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. మొత్తం కేసుల్లో 8.50 శాతం కేసులు మాత్రమే క్రియాశీలంగా ఉన్నట్టు తెలిపింది. అలాగే, మరణాలు రేటు 1.51 శాతం తగ్గినట్టు వివరించింది.

ఇంకోవైపు, తెలంగాణా రాష్ట్రంలోనూ కరోనా కేసులు కొంత తగ్గుముఖం పట్టాయి. శనివారం రాష్ట్రవ్యాప్తంగా 978 కేసులు మాత్రమే నమోదైనట్టు ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.

వీటితో కలుపుకుని రాష్ట్రవ్యాప్తంగా
ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 2,31,252కు పెరిగింది. అలాగే, శనివారం కరోనా కారణంగా నలుగురు మృతి చెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 1,307కు పెరిగింది.

మహమ్మారి బారి నుంచి శనివారం 1,446 మంది కోలుకోవడంతో ఈ మొత్తం సంఖ్య 2,10,480కి చేరుకుంది. రాష్ట్రంలో ఇంకా 19,465 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని, వీరిలో 16,430 మంది హోం ఐసోలేషన్‌లో ఉండి చికిత్స పొందుతున్నారని అధికారులు తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో శనివారం రాత్రి 8 గంటల నాటికి 185 కేసులు నమోదయ్యాయి.
దీనిపై మరింత చదవండి :