గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 7 ఏప్రియల్ 2021 (10:53 IST)

కరోనా ఉగ్రరూపం... కొత్త కేసులు 1.15 లక్షలు.. క్రియాశీలక కేసులు 8 లక్షలు

దేశవ్యాప్తంగా కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది. మరోసారి రికార్డు స్థాయిలో మహమ్మారి విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో 12,08,329 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 1,15,736 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. రెండు రోజుల క్రితం మొట్టమొదటిసారిగా రోజూవారీ కేసులు లక్ష మార్కు(1,03,558)ను దాటాయి. 
 
తాజాగా మరోసారి అంతకుమించిన కేసులు నమోదయ్యాయి. మంగళవారం మరణాల సంఖ్యలో కూడా భారీ పెరుగుదల కనిపించింది. 630 మంది ప్రాణాలు విడిచారు. ఈ విషయాన్ని బుధవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం 1.28 కోట్ల మందికి పైగా వైరస్ బారిన పడగా.. 1,66,177 మంది ప్రాణాలు కోల్పోయారు.
 
కరోనా వేగంగా విస్తరిస్తుండటంతో.. క్రియాశీల కేసుల్లో పెరుగుదల కనిపిస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 8,43,473(6.21శాతం) మంది వైరస్‌తో బాధపడుతున్నారు. ఇక, కొవిడ్‌బారి నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య మెరుగ్గానే ఉంటుంది. మంగళవారం ఒక్కరోజే 59,856 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. మొత్తంగా 1,17,92,135 మంది వైరస్‌ను జయించగా.. రికవరీ రేటు 92.48 శాతానికి పడిపోయింది.
 
ఇక మహారాష్ట్రలో వైరస్‌ విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో ఇక్కడ 55 వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. దేశంలో కొత్తగా నమోదవుతున్న కేసులు, మరణాల్లో ఈ రాష్ట్రం నుంచే ఎక్కువ శాతం ఉండటం ఆందోళన కలిగిస్తోంది. 
 
అలాగే, తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి వేగంగా విజృంభిస్తోంది. రోజు వారీ కేసులు 2 వేలకు చేరువలో ఉన్నాయి. నిన్న రాత్రి 8గంటల వరకు 74,274 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా... కొత్తగా 1,914 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 
 
ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ బుధవారం ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది. రాష్ట్రంలో నిన్న కరోనాతో ఐదుగురు మరణించారు. దీంతో కరోనాతో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 1,734కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న 285 మంది కోలుకున్నారు. 
 
రాష్ట్రంలో ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 3,03,299కి చేరింది. ప్రస్తుతం 11,617 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని, వారిలో 6,634 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో 393 కేసులు నమోదయ్యాయి.