గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : సోమవారం, 2 నవంబరు 2020 (16:01 IST)

కోవిడ్ నుంచి కోలుకున్నా వైరస్ జాడలున్నాయా..? అమ్మో.. జరజాగ్రత్త!

కరోనా వైరస్‌కు ఇంకా వ్యాక్సిన్ రాలేదు. అయితే వైద్యులు పోరాటం మేరకు కోవిడ్ రోగులకు చికిత్స చేస్తున్నారు. కోవిడ్-19 వ్యాప్తి చెందిన నాటి నుంచి వైరస్‌ గురించి రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. కరోనా ఒక్కసారి వచ్చిపోతే మళ్లీ రాదని అంతా నమ్ముతున్నారు. అయితే, కరోనా నుంచి కోలుకున్నవారిలోనూ వైరస్‌ జాడలు కనిపిస్తున్నాయని తాజాగా ఓ అధ్యయనంలో తేలింది. 
 
కరోనా నుంచి కోలుకున్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలని, ఇతరులతో సన్నిహితంగా ఉండకూడదని ఈ అధ్యయనం సూచిస్తోంది. ఈ పరిశోధనా ఫలితాలు అమెరికన్‌ జర్నల్‌ ఆఫ్‌ ప్రివెంటివ్‌ మెడిసిన్‌లో ప్రచురితమయ్యాయి. పరిశోధకులు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ప్రమాణాలకు అనుగుణంగా 131 మంది కరోనా వచ్చి కోలుకున్నవారిపై అధ్యయనం చేశారు. 
 
దగ్గు, అలసట, విరేచనాలు, తలనొప్పి, వాసన లోపాలు, ఆకలి లేకపోవడం, గొంతు నొప్పి, రినిటిస్ లాంటి కొవిడ్ -19 కు సంబంధించిన లక్షణాలు, సంకేతాల నిలకడపై దృష్టి పెట్టి జనాభా, వైద్య, క్లినికల్ సమాచారం సేకరించారు. వారికి పరీక్షలు నిర్వహించారు. ఇందులో 16.7 శాతం మందికి మళ్లీ కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. అయితే,వారిలో ఎవరికీ జ్వరం లేదని, ఆరోగ్యస్థితిలోనూ మెరుగుదల ఉందని గుర్తించారు.
 
అయితే, వీరిలో గొంతునొప్పి, జలుబు సంబంధిత లక్షణాలున్నట్లు తేల్చారు. కోవిడ్‌నుంచి కోలుకున్నవారిలో ఈ లక్షణాలు దీర్ఘకాలికంగా ఉంటే అశ్రద్ధ చేయొద్దని, వీరిపై నిరంతర పర్యవేక్షణ అవసరమని అధ్యయనానికి నేతృత్వం వహించిన ఇటలీలోని కాథలిక్ యూనివర్సిటీ ఆఫ్ సేక్రేడ్ హార్ట్ ప్రొఫెసర్‌ ఫ్రాన్సిస్కో లాండి చెప్పారు.