గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఎం
Last Updated : శనివారం, 1 మే 2021 (20:22 IST)

హోమ్ ఐసోలేషన్‌లో ఉండేవారికి కేంద్రం ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు

దేశవ్యాప్తంగా కోవిడ్ కేసులు పెరుగుతున్ననేపథ్యంలో ఆస్పత్రుల్లో బెడ్లు, ఆక్సిజన్ కొరత ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వశాఖ గతంలో ఇచ్చిన హోం ఐసోలేషన్ మార్గదర్శకాలను సవరించి కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. 
 
స్వల్ప కోవిడ్ లక్షణాలు, ఎలాంటి లక్షణాలు లేకపోయినా పాజిటివ్ వచ్చిన (ఎసింప్టమాటిక్) ఉన్నవారు ఇళ్లలో సెల్ఫ్ ఐసోలేషన్ (స్వీయ నిర్బంధం)లో ఉన్నప్పుడు తీసుకోవల్సిన జాగ్రత్తలను ఇందులో తెలిపింది. 
 
కోవిడ్ పరీక్షల్లో పాజిటివ్‌గా తేలి, ఎలాంటి అనారోగ్య లక్షణాలు లేకుండా, 94%పైన ఆక్సిజన్‌ స్థాయి ఉన్నవారు లక్షణాల్లేని బాధితుల కిందికి వస్తారు. ఊపిరి తీసుకోవడానికి ఇబ్బందుల్లేనప్పటికీ కేవలం జ్వరం, జలుబు, ముక్కు కారడం, గొంతులో ఇబ్బందులు (అప్పర్‌ రెస్పిరేటరీ ట్రాక్ట్‌ లక్షణాలు) మాత్రమే ఉండి, 94%కి పైగా ఆక్సిజన్‌ స్థాయి ఉన్నవారు స్వల్ప లక్షణాలున్న వారి పరిధిలోకి వస్తారు. వీరంతా తగిన ఏర్పాట్లు చేసుకుని ఇంట్లోనే ఉండొచ్చని కేంద్రం ఇచ్చిన తాజా మార్గదర్శకాల్లో వెల్లడించింది.
 
హోం ఐసొలేషన్‌ ఎవరికి?
* కోవిడ్ పాజిటివ్‌గా తేలి.. లక్షణాలేవీ లేవని లేదా స్వల్ప లక్షణాలున్నాయని వైద్యాధికారి ధ్రువీకరించాలి. ఇంట్లో ఐసోలేషన్ (స్వీయ నిర్బంధంలో) ఉండటానికి వీలైనంత స్థలం ఉండాలి.
 
* 24 గంటలూ చూసుకునే సంరక్షకుడు ఉండాలి. బాధితులు హోం ఐసొలేషన్‌లో ఉన్నంతకాలం వారు అవసరమైనప్పుడు వైద్యులతో సంప్రదింపులు జరుపుతుండాలి.
 
* 60 ఏళ్లు పైబడిన వారితో పాటు రక్తపోటు, మధుమేహం, గుండె, ఊపిరితిత్తులు, కాలేయం, మూత్రపిండాలు, సెరెబ్రోవాస్కులర్‌కు సంబంధించిన దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్నవారిని మాత్రం వైద్యాధికారులు తగినవిధంగా పరీక్షించిన తర్వాతే హోం ఐసొలేషన్‌కు అనుమతించాలి.
 
* హెచ్‌ఐవీ, అవయవ మార్పిడి, క్యాన్సర్‌లాంటి సమస్యలున్న వారిని హోం ఐసొలేషన్‌కు సిఫార్సు చేయకూడదు. అవసరమైతే డాక్టర్లు వారి పరిస్థితులను సూక్ష్మంగా పరిశీలించిన తర్వాతే అనుమతివ్వాలి.
 
* హోం ఐసొలేషన్‌లో ఉన్నవారి సంరక్షకులు ముందు జాగ్రత్తగా డాక్టర్లు సూచించిన విధంగా హైడ్రాక్సీక్లోరోక్విన్‌ మందులు తీసుకోవాలి.
 
లక్షణాలు లేకున్నా ఏకాంతమే
చికిత్స ఏమిటి?
* డాక్టర్‌ను సంప్రదించిన మీదట తనకున్న ఇతరత్రా అనారోగ్య సమస్యలకు సంబంధించిన మందులను కొనసాగించాలి.
 
* జ్వరం, జలుబు, దగ్గు సమయాల్లో లక్షణాలకు అనుగుణంగా మందులు తీసుకోవాలి.
 
* రోజుకు రెండుసార్లు నీటితో గార్గిల్‌ చేయడం, ఆవిరి తీసుకోవడం మంచిది.
 
* రోజుకు 4 సార్లు పారాసిటమాల్‌ 650 ఎంజీ తీసుకున్నప్పటికీ జ్వరం అదుపులోకి రాకపోతే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. అలాంటి సమయంలో వైద్యులు నాన్‌స్టెరాయిడల్‌ యాంటీ ఇన్ఫలమేటరీ డ్రగ్స్‌ (ఉదాహరణకు నాప్రాక్సిన్‌ 250 ఎంజీ రోజుకు రెండుసార్లు) సిఫార్సు చేయొచ్చు.
 
* ఖాళీ కడుపుతో రోజుకోసారి ఐవర్‌మెక్టిన్‌ 200 ఎంసీజీ ట్యాబ్‌లెట్‌ కూడా 3 నుంచి 5 రోజులపాటు ఉపయోగించవచ్చు.
 
* లోపలికి పీల్చుకొనే బ్యూడెసొనైడ్‌ (ఇన్‌హేలర్స్‌ ద్వారా ఒక్కోసారి 800 ఎంసీజీ చొప్పున రోజుకు రెండుసార్లు) 5-7 రోజులు ఉపయోగించవచ్చు. అయితే లక్షణాలు కనిపించిన 5 రోజుల తర్వాత కూడా జ్వరం, దగ్గులాంటివి ఉన్నప్పుడు మాత్రమే ఇది వాడాలి.
 
* రెమ్‌డెసివిర్‌తోపాటు, ఇతర ఇన్వెస్టిగేషనల్‌ థెరఫీ మందులన్నీ వైద్యుల సూచనలతో, ఆసుపత్రుల్లో ఉన్నప్పుడు మాత్రమే తీసుకోవాలి. ఇంట్లో ఉండగా రెమ్‌డెసివిర్‌ తీసుకొనే ప్రయత్నం చేయొద్దు.
 
* తేలికపాటి లక్షణాలున్న వారికి ఓరల్‌ స్టెరాయిడ్స్‌ ఇవ్వకూడదు. 7 రోజుల తర్వాత కూడా జ్వరం, తీవ్రమైన దగ్గు లాంటి లక్షణాలు ఉంటే డాక్టర్‌ను సంప్రదించిన తర్వాతే తక్కువ మోతాదులో ఓరల్‌ స్టెరాయిడ్స్‌ ఉపయోగించాలి.
 
* ఆక్సిజన్‌ స్థాయి తగ్గుతున్నా, ఊపిరి అందని పరిస్థితి ఉన్నా వెంటనే డాక్టర్‌ను సంప్రదించి ఆసుపత్రిలో చేర్చాలి.
 
* ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉన్నప్పుడు.. గది వాతావరణంలో ఆక్సిజన్‌ స్థాయి 94% కంటే తగ్గిపోయినప్పుడు.. ఛాతిలో నిరంతరం నొప్పి, ఒత్తిడి ఉన్నప్పుడు.. మానసిక అయోమయం, లేవడానికి చేతకానప్పుడు.. వెంటనే వైద్యులను సంప్రదించాలి.
 
హోం ఐసొలేషన్‌ ఎప్పుడు ముగించాలి?
లక్షణాలు కనిపించడం మొదలైన నాటి నుంచి కనీసం 10 రోజుల తర్వాత, వరుసగా 3 రోజులు జ్వరం రాకపోయినప్పుడే హోం ఐసొలేషన్‌ను ముగించాలి.
 
ఒకసారి హోం ఐసొలేషన్‌ సమయం ముగిసిన తర్వాత మళ్లీ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం లేదు.
 
బాధితులకు సూచనలు
* ఇంట్లో ఇతర కుటుంబ సభ్యులకు దూరంగా ప్రత్యేక గదికే పరిమితం కావాలి. ఆ గదిలోకి మంచి గాలి, వెలుతురు వచ్చేలా ఉండాలి.
 
* బాధితులు నిరంతరం 3 పొరల మెడికల్‌ మాస్క్‌ ధరించి ఉంచాలి. 8 గంటలల్లోపు ఆ మాస్క్‌ను తొలగించాలి. సంరక్షకులు ఆ గదిలోకి వెళ్లాల్సి వస్తే ఇద్దరూ ఎన్‌ 95 మాస్క్‌ వాడాలి.
 
* 1% సోడియం హైపోక్లోరైట్‌తో శుభ్రం చేసిన తర్వాతే మాస్క్‌ని పడేయాలి.
 
* శరీరంలో తగినంత శక్తి ఉండేందుకు వీలుగా బాధితులు విశ్రాంతి తీసుకోవడంతో పాటు, ఎక్కువ మొత్తంలో నీరు, ద్రవాలు తీసుకోవాలి.
 
* తుమ్ము, దగ్గు, ఉమ్ము, చీదే సమయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
 
* తరచూ చేతులను కనీసం 40 సెకెన్ల పాటు సబ్బుతో కడుక్కోవాలి.. లేదంటే ఆల్కాహాల్‌ ఆధారిత శానిటైజర్‌తో శుభ్రం చేసుకోవాలి.
 
* గదిలో తరచూ వాడే వస్తువులను 1% హైపోక్లోరైట్‌ సొల్యూషన్‌తో శుభ్రం చేసుకోవాలి.
 
* ఆక్సీమీటర్‌తో ఎప్పటికప్పుడు ఆక్సిజన్‌ స్థాయిని పరీక్షించుకోవాలి. శరీర ఉష్ణోగ్రతలనూ నిరంతరం పరీక్షించుకుంటూ ఉండాలి. ప్రతి 4 గంటలకు లక్షణాలను గమనిస్తూ రాసిపెట్టుకోవాలి. పరిస్థితులు దిగజారుతున్నట్లు ఏమాత్రం అనిపించినా వెంటనే డాక్టర్‌కు చెప్పాలి.
 
సంరక్షకులు ఇలా చేయాలి
* ఇంట్లో 3 పొరల మెడికల్‌ మాస్క్‌ ధరించడం తప్పనిసరి. మాస్క్‌ పైభాగాన్ని తాకడం లేదా చేతులతో సరి చేయకూడదు. మాస్క్‌ తడిచిపోయినా, అపరిశుభ్రంగా మారినా మార్చేయాలి. అనంతరం చేతులను శుభ్రం చేసుకోవాలి. ముఖాన్ని తాకడాన్ని మానుకోవాలి.
 
* చేతులు సబ్బుతో శుభ్రం చేసుకున్న తర్వాత ఒక్కసారి వాడిపడేసే టిష్యూ పేపర్లతో తుడుచుకోవడం మేలు. అవి లేకపోతే ఇందుకోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న టవల్స్‌ని మాత్రమే వాడాలి.
 
బాధితులు దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు దూరంగా ఉండాలి. వారిని ఎప్పుడైనా తాకాల్సి వస్తే.. వాడిపడేసేందుకు వీలుగా ఉండే హ్యాండ్ గ్లౌజ్ లు ఉపయోగించాలి.
 
* బాధితులు వాడే సిగరెట్లు, వంట పాత్రలు, తిండి పదార్థాలు, పానీయాలు, టవళ్లు, దుప్పట్లు లాంటివి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరూ వినియోగించరాదు.
 
* బాధితులున్న గదిలోకే ఆహారం అందించాలి. చేతి తొడుగులు వేసుకుని ఆ పాత్రలను డిటర్జెంట్‌ సబ్బుతో శుభ్రం చేయాలి.
 
* కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి మార్గదర్శకాల ప్రకారం మాస్కులు, ఫుడ్‌ ప్యాకెట్లు, ఇతర వస్తువులను పడేయాలి.