కోవిషీల్డ్ రెండు డోసుల మధ్య వ్యవధిని కేంద్రం ఇటీవల పొడిగించింది. కోవిడ్ వర్కింగ్ గ్రూప్ సూచనలతో ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెన్‌కా టీకా రెండు డోస్‌ల మధ్య విరామం 12 నుంచి 16 వారాలకు పెంచించింది. దీంతో రెండో డోస్ కోసం వ్యాక్సినేషన్ కేంద్రాలకు వెళ్లేవారికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
కోవిషీల్డ్ రెండో డోసు కోసం ఇప్పటికే అపాయింట్‌మెంట్ తీసుకుంటే చెల్లుబాటు అవుతుందని కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొంది. కొవిన్ పోర్టల్‌లో అపాయింట్‌మెంట్‌ను రద్దు చేయలేదని పేర్కొంది.
అయితే, రెండో డోస్ కోసం కొత్తగా అపాయింట్‌మెంట్ తీసుకునేవారికి మాత్రం గడువు పెంపు వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఆ మేరకు కొవిన్ పోర్టల్‌లో మార్పులు చేసినట్లు తెలిపింది.
అలాగే భారత్‌లో కోవిషీల్డ్ టీకా వేసుకున్న వారిలో కేవలం 26 మందిలో మాత్రమే రక్త స్రావం, రక్తం గడ్డకట్టడం వంటి సంఘటనలు చోటు చేసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనికా తయారు చేసిన టీకాలను.. ఇండియాలో సీరం సంస్థ కోవిషీల్డ్ పేరుతో పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆస్ట్రాజెనికా టీకాల వల్ల .. కొందరిలో రక్తం గడ్డకట్టినట్లు ఇటీవల కొన్ని వార్తలు వచ్చాయి.
యూరోప్‌లో ఇలాంటి సమస్యలు తలెత్తిన కేసులు 20 వరకు నమోదు అయినట్లు రికార్డులు తెలిపాయి. కరోనా టీకా తీసుకున్న తర్వాత రక్తస్రావం, రక్తం గడ్డకట్టడం వంటి ఘటనలు భారత్‌లో అత్యంత తక్కువ అని నేషనల్ ఏఈఎఫ్ఐ (అడ్వెర్స్ ఈవెంట్ ఫాలోయింగ్ ఇమ్యూనైజేషన్) కమిటీ తెలిపింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖకు సోమవారం నివేదిక సమర్పించింది.
ఏప్రిల్ 3వ తేదీ వరకు ఇండియాలో 75,435,381 మందికి వ్యాక్సిన్లు ఇచ్చారని, దాంట్లో కోవీషీల్డ్ 650,819 మందికి, కోవాగ్జిన్ టీకాలను 6,784,819 మందికి ఇచ్చినట్లు నేషనల్ ఏఈఎఫ్ఐ తెలిపింది.
భారత్‌లో వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపట్టి తర్వాత 23 వేల సమస్యాత్మక కేసులను గుర్తించినట్లు.. కోవిడ్ పోర్టల్ ద్వారా దీని గురించి తెలిసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఇక వీటిలో కేవలం 700 కేసులు మాత్రమే సీరియస్‌గా ఉన్నట్లు పేర్కొన్నది. అంటే పది లక్షల్లో 9.3 కేసులు మాత్రమే సమస్యాత్మకం అని గుర్తించినట్లు కమిటీ చెప్పింది.
సుమారు 498 సీరియస్ కేసులను కమిటీ లోతుగా అధ్యయనం చేసింది. దాంట్లో 26 మందికి మాత్రం వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత రక్తం గడ్డకట్టినట్లు గుర్తించారు. కోవిషీల్డ్ తీసుకున్నవారిలో త్రాంబోఎంబోలిక్ కేసులు 0.61గా ఉన్నట్లు కమిటీ స్పష్టం చేసింది. ఇక కోవాగ్జిన్ టీకా తీసుకున్నవారిలో రక్తం గడ్డకట్టిన కేసులేవీ నమోదు కాలేదంది.
రక్తం గడ్డకట్టే కేసులు ఇండియాలో అతి స్వల్పంగా నమోదు అయినట్లు ఏఈఎఫ్ఐ వెల్లడించింది. అది కేవలం 0.61గా ఉన్నట్లు చెప్పింది. ఇదిలావుంటే, బ్రిటన్‌లో ఇది ప్రతి 10 లక్షల డోసులకు 4 కేసులు, జర్మనీలో ప్రతి 10 లక్షల డోసులకు కేవలం 10 కేసులు నమోదయినట్టు ఏఈఎఫ్ఐ కమిటీ వెల్లడించింది.
ఇదిలావుంటే, కోవిడ్ టీకా తీసుకున్నవారిలో రక్తం గడ్డకట్టడం వంటి దుష్ప్రభావాలు ఎదురుకావడంతో డెన్మార్క్, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ వంటి దేశాలు కోవిషీల్డ్‌ను నిషేధించాయి. దీనిపై ఐరోపా సమాఖ్య మెడికల్ ఏజెన్సీ దర్యాప్తు చేపట్టి కోవిషీల్డ్ సురక్షితమైందేనని, ప్రభావంతంగా పనిచేస్తుందని స్పష్టం చేసింది.