1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 23 ఏప్రియల్ 2021 (11:53 IST)

శ్వాస కోసం స్వీయ చర్యలు 'ప్రోనింగ్' విధానం

దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. లక్షలాది మంది ఈ వైరస్ బారినపడుతుండటంతో వారంతా ఆస్పత్రులకు పరుగులు తీస్తున్నారు. ఈ క్రమంలో మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్ కొరతతో పాటు, మహమ్మారి సోకిన వారికి అవసరమైన మందులు కూడా లభించని పరిస్థితి. 
 
ఈ నేపథ్యంలో, వ్యాధి సోకిన వారు  శ్వాస సక్రమంగా ఆడేలా స్వీయ చర్యలు తీసుకోవాలని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సలహా ఇస్తోంది. ఇందుకోసం 'ప్రోనింగ్' విధానాన్ని పాటించాలని సిఫార్సు చేసింది. మరింత సులువుగా శ్వాస ఆడటంతో పాటు, శరీరానికి అవరమైన ఆక్సిజన్ స్థాయిని ఈ విధానం పెంచుతుందని, దీన్ని వైద్య పరంగానూ ఆమోదించారని పేర్కొంది.
 
ఈ ప్రోనింగ్ విధానంలో స్వీయ శ్వాస పద్ధతులను పాటిస్తూ శరీరంలో ఆక్సిజన్ లెవెల్స్ పెంచుకోవాలని కోరింది. ఇక ఈ విధానంలో తొలుత బోర్లా పడుకోవాల్సి వుంటుంది. కడుపు మంచంపై ఉండేలా జాగ్రత్తలు తీసుకుని, ముఖం బోర్లా పెట్టి 30 నిమిషాల నుంచి 2 గంటల వరకు పడుకోవాల్సి వుంటుంది. దీంతో శ్వాస పీల్చుకోవడం సులువవుతుంది. 
 
ఈ ప్రక్రియ శరీరంలో ఆక్సిజన్ స్థాయి 94 శాతానికి మించి తగ్గినప్పుడు మాత్రమే చేయాలి. ఆ తర్వాత కుడివైపునకు, ఎడమ వైపునకు తిరిగి పడుకుంటూ సాధ్యమైనంత సమయం ఉండాలి. ఇది చేస్తున్నప్పుడు శరీర ఉష్ణోగ్రత, బ్లడ్ షుగర్ కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి. హోమ్ ఐసొలేషన్‌లో ఉండే వారికి 'ప్రోనింగ్' ప్రక్రియ చాలా ముఖ్యమని తెలిపింది.
 
సమయానుసారంగా ప్రోనింగ్ చేయడం ద్వారా ఎంతో మంది ప్రాణాలను కాపాడుకోవచ్చని పేర్కొంది. ఈ ప్రక్రియకు నాలుగు పిల్లోలను వాడాలని, ఒకటి మెడ కింద, రెండు గుండెల కింద, ఆపై మోకాళ్ల కింద పెట్టుకుంటే, మెరుగైన ఫలితాలు ఉంటాయని తెలిపింది. అయితే, గుండె జబ్బులు ఉన్నవారు, గర్భిణీలు, వెన్నెముక సమస్యలు ఉన్నవారు ఈ విధానాన్ని పాటించరాదని తెలిపింది. భోజనం చేసిన వెంటనే కూడా ఈ ప్రక్రియ చేయరాదని సూచించింది.