గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 26 ఏప్రియల్ 2021 (09:42 IST)

రెమ్‌డెసివిర్‌ మరణాలను ఆపలేదు - అధికంగా ఇస్తే మంచికంటే కీడే ఎక్కువ

కరోనా చికిత్స కోసం వాడుతున్న రెమ్‌డెసివిర్‌ మరణాలను ఆపలేదని గుంటూరులోని ప్రభుత్వ జ్వరాల వైద్యశాల సూపరింటెండెంట్‌ రఘు స్పష్టం చేశారు. ఈ విషయం పలు అధ్యయనాల్లో తేలినట్లు చెప్పారు. సరైన సమయంలో, సరైన మోతాదులో మాత్రమే ప్రొటోకాల్స్‌కు అనుగుణంగా వినియోగించాలన్నారు. ఆక్సిజన్‌ స్థాయి తక్కువై, ఆసుపత్రిలో చేరి మూడో దశలో ఉన్న కొవిడ్‌ బాధితులకు మాత్రమే దాన్ని ఉపయోగించాలన్నారు. 
 
అవసరం లేనప్పుడు ఇవ్వడం వల్ల రోగులకు ప్రయోజనం కంటే కీడే ఎక్కువ జరుగుతుందన్నారు. ఈ సూదిమందు రోగులందరికీ అవసరం ఉండదన్నారు. అందువల్ల రెమ్‌డెసివిర్‌ సూదిమందును ఇవ్వాలని వైద్యులపై ఒత్తిడి తేవద్దని సూచించారు. వైద్యనిపుణుల సూచన మేరకే దీనిని వాడాల్సి ఉందన్న విషయాన్ని అందరూ గుర్తించాలన్నారు. 
 
మరోవైపు, కరోనా బాధితుడికి రెమ్‌డెసివిర్‌ ఇంజెక్షన్‌ను అనవసరంగా ఇస్తే మంచి కంటే కీడే ఎక్కువగా జరుగుతుందని ఎయిమ్స్‌ (ఢిల్లీ) డైరెక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా హెచ్చరించారు. ఆ ఇంజెక్షన్లను, ఆక్సిజన్‌ సిలిండర్లను అనవసరంగా కొనిపెట్టుకోవద్దన్నారు. ఇన్ఫెక్షన్‌ తీవ్రత ఎక్కువగా ఉన్న కేసుల్లో రెమ్‌డెసివిర్‌ వాడితే ఆస్పత్రిలో ఉండే సమయం తగ్గినట్టు అమెరికాలో చేసిన ఒక అధ్యయనంలో తేలినట్టు చెప్పారు.