తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో హైఅలెర్ట్ ప్రకటించారు. కరోనా వైరస్ బారినపడి చికిత్స పొందుతూ వచ్చిన 70 యేళ్ళ వ్యక్తి మరణించారు. ఇది దేశంలో తొలి మరణంగా నమోదైంది. ఈ విషయాన్ని కర్ణాటక మంత్రి శ్రీరాములు వెల్లడించారు.
ఆయన మరణానికి కరోనానే కారణమని నిర్ధారణ అయినట్టు చెప్పారు. దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్‌లో కరోనా మరణం సంభవించడం నగర వాసులను భయభ్రాంతులకు గురిచేస్తోంది.
మరోవైపు, ఈ మహమ్మారి వెలుగుచూసిన చైనాలోని హుబేయి ప్రావిన్సులో కొత్త కేసుల నమోదు సింగిల్ డిజిట్‌కు పడిపోగా, చైనా వెలుపల మాత్రం ఇది విజృంభిస్తోంది. ఇటలీ, ఇరాన్, దక్షిణ కొరియా వంటి దేశాల్లో కోరలు చాస్తోంది.
కరోనా భయంతో ఇప్పటికే షెడ్యూల్‌లో ఉన్న కార్యక్రమాలన్నీ రద్దు అవుతున్నాయి. దేశంలో ఇప్పటివరకు 74 కేసులు నమోదయ్యాయి. దీంతో ఐపీఎల్ సహా ఇతర మ్యాచ్‌లను ఖాళీ స్టేడియాల్లోనే నిర్వహించాలని బీసీసీఐ, ఇతర క్రీడా సమాఖ్యలకు కేంద్రం సూచనలు చేసింది.
మరోవైపు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదైన విషయం తెల్సిందే. దీనికితోడు హైదరాబాద్ నగరంలో కరోనా రోగి మృతి చెందడంతో ఏపీ సర్కారు అప్రమత్తమైంది. కరోనా నిరోధక చర్యలపై రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది.
నెల్లూరు జిల్లాలో కరోనా పాజిటివ్ కేసు నమోదైందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి బులెటిన్‌లో వెల్లడించారు. ఆ వ్యక్తి ఆరోగ్యం నిలకడగా ఉందని వివరించారు. 14 రోజుల తర్వాత మళ్లీ శాంపిల్స్ పరీక్షించాక పరిస్థితిని బట్టి డిశ్చార్జ్ చేస్తామన్నారు.
కరోనా బాధితుడు కలిసిన ఐదుగురు వ్యక్తులను రెండు వారాల పాటు ఆసుపత్రిలో పర్యవేక్షణలో ఉంచుతామని తెలిపారు. జిల్లా స్థాయిలో నోడల్ ఆఫీసర్లుగా కలెక్టర్లను నియమించామని, పూర్తిస్థాయిలో మాస్కులు అందుబాటులో ఉంచామని వివరించారు. కరోనా అనుమానితుల వివరాలు తెలిపేందుకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని, 0866-2410978 నెంబరుకు ఫోన్ చేసి వివరాలు తెలుపవచ్చని జవహర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
నిర్థారణ కాలేదు
కరోనా వైరస్‌ను అరికట్టే వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసేందుకు కనీసం రెండేండ్ల సమయం పడుతుందని కేంద్రం పేర్కొంది. అధిక ఉష్ణోగ్రతల వద్ద వైరస్‌లు సాధారణంగా జీవించలేవని అయితే కరోనా విషయంలో ఇది ఇంకా నిర్ధారణ కాలేదని వెల్లడించింది. కరోనా నేపథ్యంలో ఇంటివద్ద నుంచే పనిచేయాలని ట్విట్టర్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన ఉద్యోగులను ఆదేశించింది.
నియంత్రించదగిన మహమ్మారి..
మరోవైపు, కరోనాను నియంత్రించేందుకు ముందు జాగ్రత్త చర్యలు చేపడితే ఈ వైరస్ ఓ నియంత్రించదగిన మహమ్మారి అని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా 110 దేశాల్లోని 1,26,000 మందికి కరోనా సోకిందని వెల్లడించింది. ఇటలీలో మృతుల సంఖ్య వెయ్యి దాటింది. గురువారం 189 మంది మృతి చెందారు. దీంతో మరణాల సంఖ్య 1,016కు పెరిగింది. ఇరాన్‌లో మృతుల సంఖ్య 429గా నమోదైంది. ఇంకోవైపు, కరోనా కారణంగా ఐరోపా-రష్యా దేశాలు తమ మార్స్ ప్రయోగాన్ని రెండేళ్ళపాటు వాయిదావేసుకున్నారు.