శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 24 మార్చి 2020 (18:57 IST)

మాస్క్ ఎవరికి కావాలి.. మాస్క్ ధరిస్తే ఏం చేయాలి?

ప్రపంచాన్ని భయపెడుతున్న కరోనా వైరస్ నుంచి రక్షణ పొందాలంటే ఏకైక మార్గం వ్యక్తిగత పరిశుభ్రత. బయటకు వెళ్లాలంటే ఖచ్చితంగా ముఖానికి మాస్క్ ధరించాలన వైద్యులు సలహా ఇస్తున్నారు. 
 
ముఖ్యంగా, ఇతరుల నుంచి మనకు, మన నుంచి ఇతరులకు కరోనా వైరస్‌ సోకకుండా ఉండాలంటే మాస్క్‌లు ధరించాలి. అయితే ఇలాగని ప్రతి ఒక్కరూ ఎల్లవేళలా మాస్క్‌లు ధరించి ఉండవలసిన అవసరం లేదు. మాస్క్‌ ఎవరు వేసుకోవాలంటే....
 
దగ్గు, జ్వరం, శ్వాస పీల్చుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలతో బాధపడుతున్నవారు విధిగా మాస్క్ ధరించాలి. అలాగే, కుటుంబంలో ఎవరికైన కోవిడ్ 19 సోకినట్టు అనుమానం ఉంటే ఆ వ్యక్తి కుటుంబం సభ్యులు విధిగా మాస్క్ ధరించాలి. కరోనా వైరస్ సోకిన రోగులకు వైద్య సేవలు అందించే వైద్యులు, నర్సులు, సిబ్బంది మాస్క్ ధరించాల్సి ఉంటుంది. 
 
అయితే, మాస్క్ ధరించడం పెద్ద విషయం కాదు.. కానీ ఆ మాస్క్‌ను ఏ విధంగా వాడాలి? ఏ విధంగా డిస్పోజ్ చేయాలన్న విషయం చాలా మందికి తెలియదు. ఇపుడు ఇక్కడ ఆ విషయాలు తెలుసుకుందాం. 
 
* మాస్క్‌ ముడతలు ఊడదీయాలి. ఆ ముడతలు కింది వైపుకు ఉండేలా చూసుకోవాలి.
 
* ముక్కు, నోరు, కింది దవడ కవర్‌ చేసే విధంగా, గాలి చొరబడకుండా ఉండేలా మాస్క్‌ను అడ్జస్ట్‌ చేసుకుని కట్టుకోవాలి.
 
* ప్రతి ఆరు గంటలకూ మాస్క్‌ మార్చాలి. లేదా నీటితో తడిసిన వెంటనే మార్చాలి.
 
* మాస్క్‌ తొలగించేటప్పుడు దాని ముందరి భాగాన్ని చేతులతో తాకకూడదు.
 
* మాస్క్‌లను ముఖం మీద నుంచి తొలగించి, మెడలో వేలాడదీసుకోకూడదు. 
 
* డిస్పోజబుల్‌ మాస్క్‌లను ఎట్టి పరిస్థితిలోనూ తిరిగి వాడకూడదు. వాడిన మాస్క్‌లను మూత ఉన్న చెత్త డబ్బాల్లో వేయాలి.
 
* మాస్క్‌ తొలగించిన తర్వాత చేతులను సబ్బుతో లేదంటే ఆల్కహాల్‌తో కూడిన శానిటైజర్‌తో శుభ్రం చేసుకోవాలి.