గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 15 ఏప్రియల్ 2021 (10:05 IST)

దేశంలో కరోనా సునామీ : కొత్తగా 2 లక్షల పాజిటివ్ కేసులు

దేశంలో కరోనా వైరస్ విశ్వరూపం చూపుతోంది. ఈ కరోనా వైరస్ సునామీ దెబ్బకు గతంలో ఉన్న అన్ని రికార్డులూ బద్ధలైపోతున్నాయి. గత యేడాది కంటే ఇపుడు భారీ సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. రోజుకు రెండు లక్షలకు చేరువైంది. గడచిన 24 గంటల వ్యవధిలో నమోదైన కొత్త కేసుల సంఖ్య 2,00,739 కాగా, 1,037 మంది వైరస్ కారణంగా మరణించారు. కొత్త కేసుల్లో 58,952 కేసులు మహారాష్ట్రలో, ఢిల్లీలో 17,282 కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది.
 
ఇప్పటికే దేశంలో కరోనా రెండో వేవ్ కొనసాగుతుండగా, కొత్తగా నమోదవుతున్న కేసుల సంఖ్యతో పోలిస్తే, రికవరీల సంఖ్య తక్కువగా ఉండటం అధికారులు, ప్రభుత్వ వర్గాల్లో ఆందోళన కలిగిస్తోంది. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న కేంద్ర ప్రభుత్వం, తాజాగా సీబీఎస్ఈ 10వ తరగతి పరీక్షలను రద్దు చేయడంతో పాటు, 12వ తరగతి పరీక్షలను కూడా వాయిదా వేసిన సంగతి తెలిసిందే.
 
ఇక రాష్ట్రాల వారీగా పరిశీలిస్తే, మహారాష్టలో 35.78 లక్షలు, కేరళలో 11.72 లక్షలు, కర్ణాటకలో 10.94 లక్షలు, తమిళనాడులో 9.40 లక్షలు, ఆంధ్రప్రదేశ్ లో 9.28 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకూ 13.88 కోట్ల మందికి పైగా వైరస్ సోకగా, 11 లక్షల మందికి పైగా మరణించారు. 
 
19.84 కోట్ల మందికి పైగా రికవరీ అయ్యారు. ప్రస్తుతానికి యూఎస్ అత్యధిక కేసులు (3.21 కోట్లు) నమోదైన దేశంగా ఉన్నప్పటికీ, దేశంలో ఇదేవిధంగా కరోనా ఉద్ధృతి కొనసాగితే, ఆ స్థానాన్ని ఆక్రమించేందుకు ఇండియాకు ఎన్నో రోజులు పట్టబోదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
 
మరోవైపు, తెలంగాణలో మొన్న రాత్రి 8 గంట‌ల నుంచి నిన్న రాత్రి 8 గంటల మ‌ధ్య  3,307 మందికి కరోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయింది. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ గురువారం ఉదయం వెల్లడించిన వివరాల ప్ర‌కారం... ఒక్క‌రోజులో కరోనాతో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. అదేసమయంలో 897 మంది కోలుకున్నారు.
 
ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,38,045కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 3,08,396 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య  1,788కిగా ఉంది. తెలంగాణలో ప్రస్తుతం 27,861 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 27,861 మంది హోం క్వారంటైన్‌లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీ ప‌రిధిలో కొత్త‌గా 446 మందికి క‌రోనా సోకింది.