శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 14 ఏప్రియల్ 2021 (17:21 IST)

11 కోట్ల మందికి టీకా : కరోనా వైరస్ సంక్రవించిన ముఖ్యమంత్రులు వీరే...

దేశంలో వ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా సాగుతోంది. నేటి వ‌ర‌కు దేశవ్యాప్తంగా 11 కోట్ల మందికిపైగా కోవిడ్ టీకా తీసుకున్నారు. టీకా వేసుకున్న వారి మొత్తం సంఖ్య 11,11,79,578గా ఉన్న‌ట్లు కేంద్ర ఆరోగ్య‌శాఖ బుధవారం వెల్ల‌డించింది. 
 
కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు వీలుగా ఏప్రిల్ 11వ తేదీ నుంచి కేంద్రం కరోనా టీకా ఉత్స‌వ్ నిర్వ‌హిస్తోంది. బుధవారం టీకా ఉత్స‌వ్‌లో నాలుగో రోజు. గ‌త 24 గంట‌ల్లో దేశంలో 26 ల‌క్ష‌ల మందికి కోవిడ్ టీకా ఇచ్చిన‌ట్లు ఆరోగ్య‌శాఖ చెప్పింది. 
 
కోవాగ్జిన్‌, కోవీషీల్డ్ టీకాల‌ను దేశంలో ఇస్తున్నారు. అయితే మంగ‌ళ‌వారం ర‌ష్యాకు చెందిన స్పుత్నిక్ వీ టీకాకు కేంద్రం అత్య‌వ‌స‌ర అనుమ‌తి ఇచ్చింది. ఇండియాలో వ్యాక్సినేష‌న్ కోసం అనుమ‌తి పొందిన తొలి విదేశీ టీకా అదే కావ‌డం గ‌మ‌నార్హం.
 
మరోవైపు, దేశంలో కరోనా సెకెండ్ వేవ్ కలవరం రేకెత్తిస్తోంది. కరోనా తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది. సెకండ్ వేవ్ ఎవరినీ వదిలిపెట్టడం లేదు. అందులోను ప్రజలతో సంబంధం ఉన్న నేతలను కరోనా పలకరిస్తోంది. 
 
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మంత్రులే కాదు… ముఖ్యమంత్రులు కూడా వైరస్ బారిన పడుతున్నారు. ఈ నేపధ్యంలో ఇప్పటివరకు కరోనా బారిన పడ్డ ముఖ్యమంత్రులు ఎవరో ఓసారి తెలుసుకుందాం. 
 
2020 జులై 25వ తేదీన మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. దాంతో ఆయన్ను ఎంపీ రాజధాని భోపాల్‌లో ప్రధాన ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. 
 
అదే యేడాది ఏపీ ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషాకు కరోనా సోకగా, తిరుపతిలోని స్విమ్స్‌లో వుంచి చికిత్స అందించారు. అప్పట్లో స్విమ్స్ కోవిడ్ స్పెషల్ ఆసుపత్రిగా వుండింది. 
 
2020 సెప్టెంబర్ 2వ తేదీన గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్‌కు కరోనా సోకింది. అయితే ఆయనకు కరోనా లక్షణాలు లేకపోవడంతో హోం ఐసోలేషన్‌లో వుంచి చికిత్స అందించారు. 
 
ఈ నెలలోనే కర్నాటక ఉప ముఖ్యమంత్రి గోవింద్ ఎం కర్జోల్‌కు కరోనా సోకింది. 2020 నవంబర్ 15వ తేదీన మణిపూర్ సీఎం బీరేన్ సింగ్‌కు కరోనా సోకినా పెద్దగా లక్షణాలు లేకపోవడంతో తన నివాసంలోనే ఐసోలేషన్‌లో వుండి చికిత్స తీసుకున్నారు.
 
2020 డిసెంబర్ 11 వ తేదీన మేఘాలయ ముఖ్యమంత్రి కన్రాడ్ కె సంగ్మాకు కరోనా పాజిటివ్ రాగా హోం ఐసోలేట్ అయ్యారు. డిసెంబర్ 12వ తేదీన ఉత్తరాంఖండ్ సిఎం త్రివేంద్ర సింగ్ రావత్‌కు కరోనా సోకడంతో ఐసోలేషన్‌లో చికిత్స పొందారు. 
 
మొన్న ఏప్రిల్ 7వ తేదీన త్రిపుర ముఖ్యమంత్రి బిప్లవ్ దేవ్ కుమార్ కరోనా పాజిటివ్‌గా తేలింది. తన నివాసంలోనే ఐసోలేట్ అయి చికిత్స పొందుతున్నారాయన. ఏప్రిల్ 8వ తేదీన కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు పాజిటివ్‌గా తేలింది.