శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 11 జూన్ 2020 (08:49 IST)

కరోనా కోసం గొర్రెల బలి - వైరస్ నుంచి కోలుకున్న రోగి సూసైడ్

జార్ఖండ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి తక్కువగానే ఉంది. ఇక్కడ కేసుల నమోదు కూడా అదుపులోనే ఉంది. అయినప్పటికీ.. కరోనా వైరస్ పోవాలంటూ జార్ఖండ్ వాసులు ఏకంగా 400 గొర్రెలను గ్రామ దేవత ఆలయంలో బలిచ్చారు. ఈ ఘటన కొడెర్మా జిల్లాలోని చంద్వారా బ్లాక్ పరిధిలో ఉన్న ఉర్వాన్ గ్రామంలో జరిగింది. 
 
కరోనా మహమ్మారి బారి నుంచి తమ గ్రామానికి రక్షణ కలుగుతుందన్న నమ్మకంతోనే ఈ పని చేశామని, తాము గ్రామ దేవతను నమ్మాముకాబట్టే గొర్రెలను బలిచ్చామని గ్రామస్థులు చెబుతున్నారు. ఈ కార్యక్రమానికి సూత్రధారులు ఎవరన్న విషయం మాత్రం తెలియరాలేదు. అయితే, ఈ విషయం ప్రభుత్వ అధికారుల దృష్టికి వెళ్లడంతో వారు విచారణకు ఆదేశించారు. 
 
ఇదిలావుంటే, కరోనా వైరస్ బారినపడి చికిత్స అనంతరం కోలుకున్న 33 ఏళ్ల యువకుడు ఆసుపత్రిలోనే ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఘటన కేరళలోని తిరువనంతపురంలో జరిగింది. 
 
ఈ వైరస్ బారినపడిన ఓ యువకుడుని ఇటీవల తిరువనంతపురం వైద్యకళాశాలలో చేర్చారు. అక్కడ ఐసోలేషన్ గదిలో ఉంచి వైద్యులు చికిత్స అందిస్తూ వచ్చారు. ఈ క్రమంలో రెండుసార్లు ఆసుపత్రి నుంచి పారిపోయిన రోగి తన ఇంటికి చేరుకున్నాడు. 
 
అతడిని చూసిన గ్రామస్థులు తిరిగి అతడిని పోలీసులకు పట్టించారు. పోలీసులు అతడిని ఆసుపత్రికి తరలించారు. అక్కడ అతడికి కరోనా పరీక్షలు నిర్వహించగా నెగటివ్ అని వచ్చింది. దీంతో అతడిని డిశ్చార్జ్ చేయాలని అధికారులు నిర్ణయించి అతడు ఉంటున్న ఐసోలేషన్ గదికి వెళ్లి చూడగా ఉరికి వేలాడుతూ కనిపించాడు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.