ముంబైలో కరోనా విజృంభణ.. డిసెంబర్ 31వరకు స్కూళ్లు మూసివేత
ముంబైలో కరోనా విజృంభిస్తోంది. తాజాగా మహారాష్ట్ర రాజధాని ముంబైలో డిసెంబర్ 31వ తేదీ వరకు స్కూళ్లను మూసివేయనున్నారు. బృహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నడిచే పాఠశాలలను డిసెంబర్ 31 వరకు మూసివేస్తున్నట్లు ముంబై మేయర్ కిశోరి పడ్నేకర్ తెలిపారు.
కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో స్కూళ్లను తెరవడం లేదన్నారు. వాస్తవానికి సోమవారం నుంచి ముంబైలో స్కూళ్లను తిరిగి ఓపెన్ చేయాల్సి ఉన్నది. అయితే బీఎంసీ పరిధిలో ఉండే స్కూళ్లకు మాత్రం ఆంక్షలను పెంచేశారు.
కోవిడ్ కేసులు పెరగడంతో ముంబై మేయర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ముందుగా అనుకున్నట్లు నవంబర్ 23వ తేదీన స్కూళ్లను తెరవడం లేదని మేయర్ తెలిపారు.
మరోవైపు కరోనా వ్యాక్సిన్స్ ట్రయల్స్ ప్రారంభమైనాయి. ఇందులో భాగంగా హర్యానా ఆరోగ్య శాఖ మంత్రి అనిల్ విజ్.. కోవాగ్జిన్ టీకా ట్రయల్ డోసు తీసుకున్నారు. అంబాలాలోని ఓ హాస్పిటల్‌లో ఆయన ఇవాళ కోవిడ్ టీకాను వేయించుకున్నారు.
హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ కోవాగ్జిన్ టీకాను రూపొందిస్తోంది. అయితే శుక్రవారం కోవాగ్జిన్ మూడవ దశ ట్రయల్స్ దేశంలో ప్రారంభం అయ్యాయి. ఈ నేపథ్యంలో హర్యానా మంత్రి అనిల్ విజ్.. వాలంటీర్ రూపంలో కోవాగ్జిన్ టీకా వేయించుకున్నారు.