బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 6 జనవరి 2022 (11:13 IST)

కరోనా వ్యాక్సిన్ల కోసం క్యూ కడుతున్న యువత

దేశంలో 15 నుంచి 18 యేళ్లలోపు యువతకు కరోనా వ్యాక్సినేషన్ జోరుగా సాగుతోంది. ఈ టీకాలను వేయించుకునేందుకు యువత టీకా కేంద్రాలకు పోటెత్తుతోంది. ఫలితంగా గత మూడు రోజుల్లో ఏకంగా 1.24 కోట్ల మంది యువతీ యువకులు ఈ టీకాలను వేయించుకున్నారు. 
 
ప్రస్తుతం దేశంలో కరోనా థర్డ్ వేవ్ శరవేగంగా వ్యాపిస్తుంది. అదేసమయంలో ఈ వైరస్ నుంచి రక్షించేందుకు వీలుగా 15-18 యేళ్ల మధ్య చిన్నారులకు కరోనా టీకాలు వేసేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. ఈ కార్యక్రమం సోమవారం నుంచి ప్రారంభమైంది. 
 
అయితే, గత ముూడు రోజుల్లోనే 1,24,02,515 మంది చిన్నారులు ఈ టీకాలను వేయించుకున్నారు. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య శాఖామంత్రి మాన్సుక్ మాండవీయ వెల్లడించారు. బుధవారం ఒక్కరోజే ఏకంగా 82,26,211 వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేయగా, వాటిలో 37,44,635 డోసులను కేవలం యువతకే వినియోగించారు. 
 
ఇదిలావుంటే, మన దేశంలో కరోనా వ్యాక్సినేషన్ తొలి దశ కార్యక్రమం గత యేడాది జనవరి 16వ తేదీన ప్రారంభించిన విషయం తెల్సిందే. తొలి దశలో కరోనా వారియర్లుగా పరిగణించిన వైద్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్ వర్కర్లకు వ్యాక్సిన్ వేయగా, రెండో దశలో 60 యేళ్లు పైబడిన వారికి, 45 యేళ్ళు పైబడి అనారోగ్యంతో బాధపడేవారికి టీకాలు వేశారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి 45 యేళ్లు పైబడిన వారికి టీకాలు వేశారు. ఈ నెల 3 తేదీ నుంచి 15-18 యేళ్ల చిన్నారులకు వ్యాక్సిన్లు వేస్తున్నారు. ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా మొత్తం 148.58 కోట్లకు పైగా వ్యాక్సిన్ డోసుల పంపిణీ జరిగింది.