శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 16 మార్చి 2020 (08:22 IST)

బకింగ్ హామ్ ప్యాలెస్‌కు కరోనా పోటు.. మహారాణి క్వీన్ మకాం మార్పు

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ఇపుడు... బ్రిటన్ రాణి అధికారిక నివాసమైన బకింగ్ హామ్ ప్యాలెస్‌ను వదల్లేదు. ఈ ప్యాలెస్‌ను తిలకించేందుకు నిత్యం వందలాది మంది సందర్శకులు వచ్చి వెళ్తుంటారు. దీంతో మహారాణి క్వీన్ ఎలిజబెత్-2 మకాంను మరోచోటికి మార్చారు. మహారాణికి ఈ వైరస్ సోకకుండా ఉండేందుకు వీలుగా ముందు జాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నారు. 
 
బ్రిటన్ రాణి అధికారిక నివాసం బకింగ్ హామ్ ప్యాలెస్ నిత్యం సందర్శకుల తాకిడితో కోలాహలంగా ఉంటుంది. దీంతో కరోనా సోకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని రాజకుటుంబం భావించింది. అందుకే మహారాణి క్వీన్ ఎలిజబెత్-2తో పాటు యువరాజ్ ఫిలిప్‌ను కూడా బెర్క్ షైర్‌లోని రాజవిడిది విండ్సర్ క్యాజిల్‌కు తరలించారు.
 
ప్రస్తుతం మహారాణి ఆరోగ్యం భేషుగ్గానే ఉందని, అయితే ఆరోగ్య పరిరక్షణ దృష్ట్యా ఆమెను తరలించడమే అత్యుత్తమ నిర్ణయం అని భావిస్తున్నామని రాజకుటుంబ వర్గాలు తెలిపాయి. బకింగ్ హామ్ ప్యాలెస్‌కు ప్రపంచం నలుమూలల నుంచి రాజకీయవేత్తలు, ఇతర ప్రముఖులు వస్తుంటారని, ఇటీవల వరకు మహారాణి నిత్యం అనేకమందిని కలుస్తూ వచ్చేది. 
 
ఈ నేపథ్యంలో కరోనా నివారణ చర్యల్లో భాగంగా ఆమెను తరలించకతప్పలేదని ఓ రాజకుటుంబ సన్నిహితుడు పేర్కొన్నారు. పైగా, బకింగ్ హామ్ ప్యాలెస్ లో సిబ్బంది కూడా ఎక్కువేనని, ఇది కూడా ఓ కారణమని తెలిపారు. కాగా, ప్రస్తుతం బకింగ్ హామ్ ప్యాలెస్‌లో 500 మందికి పైగా సిబ్బంది విధలు నిర్వర్తిస్తున్నారు. వీరందరిని కూడా తగిన జాగ్రత్తలు పాటించాల్సిందిగా ఆదేశాలు జారీచేశారు.