గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 15 మార్చి 2020 (12:40 IST)

సెంచరీ కొట్టిన కరోనా కేసులు... స్పెయిన్‌లో ఒకేరోజు 1500 పాజిటివ్ కేసులు

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ను కేంద్ర ప్రభుత్వం జాతీయ విపత్తుగా ప్రకటించింది. ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా పకడ్బందీగా చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో దేశంలో కరోనా వైరస్ బారినపడిన వారి సంఖ్య వందకు చేరింది. అలాగే, కరోనా బాధితుల కోసం అన్ని చర్యలు తీసుకోవాలని అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలను కేంద్ర సర్కారు కోరింది. ఒక్క మహారాష్ట్రలో 19గా ఉన్న కరోనా కేసులు ఇపుడు ఏకంగా 31కు చేరాయి. 
 
మరోవైపు, ప్రపంచ వ్యాప్తంగ ఈ కరోనా వైరస్ ఇప్పటివరకు 152 దేశాలకు వ్యాపించింది. అలాగే, ఈ వైరస్ బారినపడి ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు 5,839 మంది ప్రాణాలు కోల్పోయారు. చైనాలో అత్యధికంగా 3199, ఇటలీలో 1441, ఇరాన్‌లో 611, స్పెయిన్‌లో 196, ఫ్రాన్స్‌లో 91, దక్షిణ కొరియాలో 75, అమెరికాలో 60 మంది మృతి చెందారు. అదేసమయంలో ఒకే రోజులో స్పెయిన్‌లో 1500 మందికి ఈ వైరస్ సోకింది. 
 
ఇంకోవైపు, కరోనా విజృంభణ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో ఈ వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు రాష్ట్ర సర్కారు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. ఏపీ కుటుంబ ఆరోగ్యశాఖ సంచాలకుడు ఈ విషయంపై ఓ ప్రకటన విడుదల చేశారు. ఏపీలో ఇప్పటివరకు 70 మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని, ఒకరికి కరోనా పాజిటివ్‌గా తేలిందని చెప్పారు. అలాగే, నెగెటివ్‌గా 57 మందికి నిర్ధారణ అయిందని, శాంపిల్స్‌ ఫలితాలు రావాల్సినవి కేసులు 12 ఉన్నాయని పేర్కొన్నారు.
 
ఇప్పటివరకు 777 మందికి స్క్రీనింగ్‌ జరిగిందని, వారు పర్యవేక్షణలో ఉన్నారని తెలిపారు. 28 రోజుల పర్యవేక్షణ పూర్తి చేసుకున్న బాధితులు 244 అని, ఆసుపత్రిలో అబ్జర్వేషన్‌లో ఉన్నవారి సంఖ్య 21 అని తెలిపారు. కరోనాపై చర్యలు తీసుకునేందుకు 1897 అంటువ్యాధుల చట్టం ప్రకారం కరోనా నియంత్రణకు జిల్లా కలెక్టర్లు, మెడికల్‌ హెల్త్‌ ఆఫీసర్లుకు అధికారాలు ఇచ్చామన్నారు. 
 
జిల్లా కలెక్టర్లను జిల్లా నోడల్‌ ఆఫీసర్లుగా ప్రకటించామన్నారు. 24 గంటలు పనిచేసే కంట్రోల్‌ రూమ్‌ నం.0866 2410978 ఏర్పాటు చేశామని చెప్పారు. అలాగే,  104 హెల్ప్‌ లైన్‌కు ఫోన్‌ చేయొచ్చని చెప్పారు. కరోనా వ్యాప్తి నిరోధం కోసం  ప్రజలు చర్యలు తీసుకోవాలని సూచించారు.
 
ఇకపోతే, వివిధ కరోనా ప్రభావిత దేశాల నుంచి వచ్చిన వారిలో 355 మంది ఆచూకీ తెలియకపోవడం ఇప్పుడు పంజాబ్‌కు సమస్యగా మారింది. వారి ఆచూకీ కోసం అధికారులు విస్తృతంగా గాలిస్తున్నారు. ఈ నెల 13వ తేదీ వరకూ ఫారిన్ నుంచి 6,011 మంది వచ్చినట్టుగా ఆరోగ్య శాఖ రిపోర్ట్ వెల్లడిస్తోంది. 
 
వీరిలో 90 మందికి కరోనా లక్షణాలు ఉన్నట్టు గుర్తించిన వైద్యులు, వారి రక్త నమూనాలను పరీక్షించగా, 85 మందికి నెగటివ్ అని రిజల్ట్స్ వచ్చింది. మిగతావారి పరీక్షా ఫలితాలు ఇంకా రాలేదు. విదేశాల నుంచి వచ్చిన వారిలో కనిపించకుండా పోయిన వారిని గుర్తించి, వారికి కూడా పరీక్షలు చేస్తామని పంజాబ్ ప్రభుత్వం వెల్లడించింది.