శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్

కోవాగ్జిన్ పేరిట కరోనా టీకా - ట్రయల్స్‌లో ప్రతికూల ఘటన : బయోటెక్

హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తూ, కోవాగ్జిన్ పేరిట కరోనా టీకాను తయారు చేసి, ట్రయల్స్ నిర్వహిస్తున్న భారత్ బయోటెక్, తన ట్రయల్స్‌లో ప్రతికూల ఘటన ఒకటి జరిగిన విషయం వాస్తవమేనని తెలిపింది. అయితే, ఈ ఘటన గురించి 24 గంటల్లోనే రిపోర్ట్ చేశామని సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. 
 
భారత్ బయోటెక్ తొలి దశ టీకా ట్రయల్స్‌లో జరిగిన ప్రతికూల ఘటన గురించి సంస్థ రిపోర్ట్ చేయలేదని మీడియాలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన భారత్ బయోటెక్, "ఆగస్టులో జరిగిన ఈ ఘటన గురించి సీడీఎస్సీఓ - డీజీసీఐకి 24 గంటల వ్యవధిలోనే రిపోర్ట్ ఇచ్చాము. 
 
అయితే ఇది వ్యాక్సిన్ కారణంగా జరుగలేదు" అని స్పష్టం చేసింది. ఈ టీకాను భారత్ బయోటెక్‌తో పాటు ఐసీఎంఆర్, పుణె వైరాలజీ ల్యాబ్‌లు సంయుక్తంగా తయారు చేసిన సంగతితెలిసిందే. ఈ వ్యాక్సిన్ ఫేజ్-3 ట్రయల్స్‌కు ఇప్పటికే అనుమతులు లభించాయి.
 
తెలంగాణాలో 873 కేసులు 
తెలంగాణలో గత 24 గంటల్లో 873 కరోనా కేసులు నమోదయ్యాయి. తెలంగాణ‌ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఆదివారం ఉదయం వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్ర‌కారం... గత 24 గంటల్లో నలుగురు కరోనాతో ప్రాణాలు కోల్పోగా, అదేసమయంలో 1,296 మంది కోలుకున్నారు.
 
ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,63,526కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,50,453 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 1,430 కి చేరింది. 
 
తెలంగాణలో ప్రస్తుతం 11,643 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 9,345 మంది హోంక్వారంటైన్‌లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 152 కరోనా కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో కొత్తగా 71 కేసులు నిర్ధారణ అయ్యాయి.