శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 13 జూన్ 2020 (10:45 IST)

కరోనా భయం : స్వీయ గృహ నిర్బంధంలోకి మంత్రి హరీష్ రావు

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఇప్పటికే ఈ రాష్ట్రంలో కరోనా కేసులు పదుల సంఖ్యలో నమోదవుతున్నాయి. ముఖ్యంగా, గ్రేటర్ హైదరాబాద్ నగర పరిధిలో ఈ వైరస్ మహమ్మారి వణికిస్తోంది. ఫలితంగా భాగ్యనగరి వాసులు వణికిపోతున్నారు. అంతేకాకుండా, హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్ కారు డ్రైవర్‌కు కరోనా వైరస్ సోకినట్టు తేలింది. 
 
ఈ విషయం తెలిసిన మరునాడే సిద్ధిపేట ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి హరీష్ రావు పీఏకు కరోనా సోకినట్టు తేలింది. దీంతో అప్రమత్తమైన అధికారులు మంత్రి, ఆయన వెంట ఉండే 51 మంది నుంచి శాంపిళ్లు సేకరించి పరీక్షలకు పంపారు. అయితే, ఈ ఫలితాల్లో మంత్రి సహా 17 మందికి నెగటివ్ వచ్చిందని అధికారులు తెలిపారు. 
 
మరోవైపు, ముందు జాగ్రత్త చర్యగా మంత్రి హరీశ్‌రావు స్వీయ గృహ నిర్బంధంలోకి వెళ్లారు. కాగా, జనగామ టీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదిగిరిరెడ్డి కూడా కరోనా బారినపడ్డారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెల్సిందే.