శనివారం, 21 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 7 డిశెంబరు 2021 (14:36 IST)

పొంచివున్న ఒమిక్రాన్ ముప్పు : డాక్టర్ శ్రీనివాస రావు హెచ్చరిక

తెలంగాణ రాష్ట్రంలో జనవరి 15వ తేదీ తర్వాత కరోనా, ఒమిక్రాన్ వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఆ రాష్ట్ర ప్రజారోగ్య విభాగం సంచాలకులు డాక్టర్ శ్రీనివాస రావు వెల్లడించారు. అందువల్ల ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, కరోనా వైరస్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయన్నారు. ఈ వైరస్ ఉధృతి జనవరి 15వ తేదీ తర్వాత మరింతగా పెరిగి ఫిబ్రవరిలో మరింత పీక్ దశకు చేరుకుంటుందన్నారు. అందువల్ల వచ్చే ఆరు వారాల పాటు ప్రతి ఒక్కరూ విధిగా మాస్కులు ధరించాలని ఆయన సూచించారు. 
 
అలాగే, అనేక మంది ఉండే ఇళ్ళలో నివసించే వారు కూడా మాస్కులు ధరిస్తే మంచిదని ఆయన సలహా ఇచ్చారు. ఇకపోతే ఒమిక్రాన్ వైరస్ వెలుగు చూసిన సౌతాఫ్రికాలో ఈ వైరస్ బారినపడి ఆస్పత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య అధికంగా ఉందని, కానీ మరణాలు మాత్రం లేవన్నారు. ఇది పెద్ద ఊరటనిచ్చే అంశమన్నారు. ఈ వేరియంట్‌తో పెద్ద సమస్య లేకపోయినప్పటికీ ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు. 
 
మరోవైపు, దేశంలో కరోనా థర్డ్ వేవ్ తప్పదని కాన్పూర్ ఐఐటీకి చెందిన ప్రొఫెసర్ అగర్వాల్ హెచ్చరిస్తున్నారు. అయితే, ఒమిక్రాన్ వైరస్‌కు భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు. మనిషి శరీరంలో సహజంగా ఉండే రోగ నిరోధక శక్తిని ఒమిక్రాన్ వైరస్ ఏమాత్రం తగ్గించబోదని స్పష్టం చేశారు. అలాగే, ఈ వైరస్ వల్ల ఏ ఒక్కరికీ ఎలాంటి క్లిష్టమైన సమస్యలు సంభవించబోవని తెలిపారు.