శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 2 డిశెంబరు 2021 (20:26 IST)

ఒమిక్రాన్ బాధిత వైద్యుడిని కలిసిన ఐదుగురికి పాజిటివ్!!

ప్రపంచ దేశాలను వణికిస్తున్న ఒమిక్రాన్ కరోనా వేరియంట్ భారత్‌లోకి అడుగుపెట్టింది. కర్నాటక రాష్ట్రంలో ఈ వైరస్ కేసులు రెండు నమోదయ్యాయి. వీరిలో ఒకరు వైద్యుడు కాగా, మరొకరు విదేశీ పౌరుడు. ఆయన తిరిగి తన స్వదేశానికి వెళ్లిపోయాడు. అయితే, కర్నాటకకు చెందిన ఒమిక్రాన్ బాధిత వైద్యుడిని కలిసిన ఐదుగురికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, వారికి పాజిటివ్ అని వచ్చింది. దీంతో ఒక్కసారిగా కర్నాటక రాష్ట్రంలో కలకలం చెలరేగింది.

 
 




ఈ విషయంపై కర్నాటక ఆరోగ్య మంత్రి డాక్టర్ కె.సుధాకర్ మాట్లాడుతూ, రాష్ట్రంలో రెండు ఒమిక్రాన్ కేసులు వెలుగు చూశాయన్నారు. ఈ ఇద్దరిలో ఒకరు వైద్యుడని చెప్పారు. ఈయన్ను కలిసిన వారిలో ఐదుగురికి పాజిటివ్‌గా తేలిందన్నారు. అంతేకాకుండా, డాక్టరును కలిసిన ప్రైమరీ, సెకండరీ కాంటాక్టులను విస్తృత స్థాయిలో కరోనా పరీక్షలు నిర్వహించగా, వీరిలో ఐదుగురికి నిర్ధారణ అయిందన్నారు. 

 
అదేసమయంలో ఒమిక్రాన్ పాజిటివ్‌ వచ్చిన వైద్యుడితో పాటు మిగిలిన ఐదుగురిని ప్రభుత్వ ఆస్పత్రిలో ఐసోలేషన్‌లో ఉంచినట్టు వివరించారు. అయితే, వీరిలో ఎవరికీ ప్రమాదకర పరిస్థితి లేదని వారందరూ కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు వేయించుకున్నవారేనని చెప్పారు.