గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 14 నవంబరు 2021 (10:34 IST)

కేరళలో 6 వేలు.. దేశంలో 11271 కరోనా పాజిటివ్ కేసులు

దేశ వ్యాప్తంగా మరో 11271 మంది కరోనా వైరస్ బారినపడ్డారు. వీరిలో ఒక్క కేరళ రాష్ట్రంలోనే ఆరు వేలకు పైగా కేసులు ఉన్నారు. గడిచిన 24 గంటల్లో కొత్తగా 11 వేల కేసులు వెలుగులోకి రాగా.. మరణాల సంఖ్య 300లోపే నమోదైంది. రికవరీ రేటు మెరుగ్గా ఉండటంతో క్రియాశీల కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది.
 
కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో 12,55,904 నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 11,271 కొత్త కేసులు బయటపడ్డాయి. వీటిలో ఒక్క కేరళ రాష్ట్రంలోనే 6 వేలకుపైగా కేసులు నమోదయ్యాయి.
 
నిన్న ఒక్క రోజే కరోనాతో చికిత్స పొందుతూ 285 మంది మరణించారు. దీంతో ఇప్పటి వరకూ ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4,63,530కి చేరింది. గడిచిన 24 గంటల్లో 11,376 మంది కరోనాను జయించారు. దీంతో ఇప్పటి వరకూ కోలుకున్న వారి సంఖ్య 3.38 కోట్లు దాటి.. రికవరీ రేటు 98.26 శాతం పెరిగింది. మార్చి 2020 తర్వాత ఇదే అత్యధికం.
 
ఇక క్రియాశీల కేసులు క్రమంగా దిగివస్తున్నాయి. ప్రస్తుతం ఆ సంఖ్య 1,35,918(0.39 శాతం)కి తగ్గి 17 నెలల కనిష్ఠానికి చేరింది. మరోవైపు వ్యాక్సినేషన్‌ కార్యక్రమంలో మళ్లీ వేగం పుంజుకుంటోంది. నిన్న 57,43,840 మందికి టీకాలు అందించగా.. ఇప్పటి వరకూ పంపిణీ చేసిన డోసుల సంఖ్య 112 కోట్లు దాటింది.