సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 26 డిశెంబరు 2023 (16:34 IST)

ఏపీలో తొలి కరోనా మరణం... తెలుగు రాష్ట్రాల్లో కోవిడ్ సంగతేంటి?

Corona
Corona
దేశంలో మరోసారి కరోనా వైరస్ విజృంభిస్తోంది. గత రెండు వారాల నుంచి దేశంలో కోవిడ్-19 కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. అలాగే తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న కరోనా కేసుల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. అలాగే, ఈ ఏడాది తొలి కరోనా మరణం మంగళవారం నమోదైంది. 
 
విశాఖపట్నంలోని కింగ్ జార్జ్ హాస్పిటల్ (కెజిహెచ్)లో కోవిడ్-19తో చికిత్స పొందుతూ ఓ మహిళ మృతి చెందింది. కొద్ది రోజుల క్రితం ఆమెను ఆసుపత్రిలో చేర్చగా, కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు అధికారులు తెలిపారు.
 
మృతురాలు తీవ్ర అనారోగ్యంతో బాధపడిందని వైద్యులు తెలిపారు. RTPCR పరీక్షలో ఆమెకు కరోనా పాజిటివ్ వచ్చిందని, అప్పటి నుండి ఆమెకు ఐసోలేషన్ వార్డులో చికిత్స అందిస్తున్నామని చెప్పారు. కానీ, ఆమె పరిస్థితి విషమించడంతో డిసెంబర్ 24న ఆమె మరణించినట్లు ప్రకటించారు. అయితే, అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది.
 
అలాగే ఈ ఏడాది తెలంగాణలో తొలి కరోనా మరణం సంభవించింది. ఉస్మానియాలో చికిత్స పొందుతూ ఓ వ్యక్తి కరోనాతో మృతి చెందాడు. ఇతర అనారోగ్య సమస్యలతో ఇటీవల ఆస్పత్రిలో చేరిన ఆయన.. ఆర్టీపీసీఆర్‌ పరీక్షలో కరోనా పాజిటివ్‌గా నిర్ధారించారు.
 
మరోవైపు, కొత్త వేరియంట్ JN.1 కేసులు దేశవ్యాప్తంగా క్రమంగా పెరుగుతున్నాయి. ఈ వేరియంట్‌ కేసుల సంఖ్య 63కి చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. 
 
అలాగే, గత 24 గంటల్లో ఏపీలో 6 కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి. విశాఖ జిల్లాలో ఐదుగురు, శ్రీకాకుళం జిల్లాలో ఒకరికి కోవిడ్‌ సోకింది. వీటితో పాటు రాష్ట్రంలో 29 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్య శాఖ వర్గాలు తెలిపాయి. 
 
కాగా, శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలానికి చెందిన వృద్ధుడు, శ్రీకాకుళానికి చెందిన మహిళ, కొత్తూరు మండలానికి చెందిన మరొకరికి పాజిటివ్‌ వచ్చినట్లు డీఎంహెచ్‌వో మీనాక్షి తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లా జియ్యమ్మవలస మండలంలో ఓ మహిళకు కోవిడ్‌ సోకిందని డీఎంహెచ్‌వో బి. జగన్నాథరావు వెల్లడించారు.
 
ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోవడంతో కరోనా కొత్త రకంగా వ్యాపిస్తోందని అధికారులు చెబుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మాస్కులు ధరించాలని సూచించారు.