గురువారం, 28 సెప్టెంబరు 2023
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 26 ఫిబ్రవరి 2023 (19:54 IST)

బౌలింగ్ చేస్తుండగా ఛాతిలో నొప్పి.. కుప్పకూలి మృతి చెందిన క్రికెటర్

deadbody
ఇటీవలి కాలంలో గుండెపోటులకు గురయ్యే వారి సంఖ్య పెరిగిపోతుంది. వయస్సుతో నిమిత్తం లేకుండా ఛాతినొప్పితో అనేక మంది చనిపోతున్నారు. ఈ వరుస సంఘటనలు ప్రతి ఒక్కరినీ కలవరపాటుకు గురి చేస్తున్నాయి. తాజాగా ఓ క్రికెటర్ బౌలింగ్ చేస్తూ కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాదకర ఘటన గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరంలో జరిగింది. 
 
తాజాగా ఇక్కడ జీఎస్టీ ఉద్యోగులు, సురేంద్ర నగర్ జిల్లా పంచాయతీ సభ్యుల మధ్య క్రికెట్ పోటీ జరిగింది. ఇందులో జీఎస్టీ ఉద్యోగి వసంత్ రాథోర్ ఒక ఎండ్‌ నుంచి బౌలింగ్ చేస్తున్నాడు. ఆ సమయంలో ఆయనకు ఛాతిలో నొప్పి వచ్చి కుప్పకూలిపోయి, అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఆ తర్వాత ఆయన్ను ఆస్పత్రికి తరలించగా గుండెపోటుతో చనిపోయినట్టు వైద్యులు నిర్ధారించారు. 
 
అలాగే, తాజాగా వ్యాయామం చేసి జిమ్ నుంటి బయటకు వచ్చిన ఓ యువకుడికి గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయి ప్రాణాలు విడిచాడు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, కర్నూలు జిల్లా ఆదోనీకి చెంది 28 యేళ్ల యువకుడు హైదరాబాద్ నగరంలో టెక్కీగా పని చేస్తున్నాడు. ప్రస్తుతం వర్క్ ఫ్రమ్ హోం సౌలభ్యం ఉండటంతో ఇంటి పట్టునుంచే విధులు నిర్వహిస్తున్నాడు. పైగా, ఇటీవలే అతనికి పెళ్లి కూడా కుదిరింది. శనివారం ఉదయం పట్టణంలోని ఓ జిమ్‌కు వెళ్లాడు. 
 
అక్కడ వ్యాయామం చేస్తుండగా, కళ్లు తిరుగుతున్నట్టుగా అనిపించడంతో స్నేహితుడితో కలిసి జిమ్ నుంచి బయటకు వచ్చాడు. ఆ తర్వాత నీళ్లు తెచ్చేందుకు స్నేహితుడు వెళ్లాడు. అదే సమయంలో మార్ఛవచ్చి ప్రాణాలు విడిచాడు. దీన్ని గమనించిన ఇరుగుపొరుగువారు యువకుడికి చేసిన సాయం కూడా ఫలితంలేకుండా పోయింది. ఆ వెంటనే ఆయన్ను పట్టణంలోని ప్రాంతీయ ఆస్పత్రికి తరలించగా, అతన్ని పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు వెల్లడించారు.