గురువారం, 19 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 22 ఫిబ్రవరి 2024 (14:53 IST)

సీకే నాయుడు ట్రోఫీ : ఒకే ఓవర్‌లో ఆరు సిక్స్‌లు - అదరగొట్టిన ఆంధ్రా కుర్రోడు

vamshhi krishna
ఏపీలోని కడప వేదికగా కల్నల్ సీకే నాయుడు క్రికెట్ ట్రోఫీ టోర్నెమెంట్ జరుగుతుంది. ఇందులో ఒకే ఓవర్‌లో ఆరు బంతులను ఆరు సిక్స్‌లుగా ఆంధ్రా కుర్రోడు బాదాడేశాడు. ఆ యువ క్రికెటర్ పేరు వంశీ కృష్ణ. నిజానికి అపుడెపుడో రంజీల్లో ఒకే ఓవర్‌లో భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ రవిశాస్త్రి ఒకే ఓవర్‌లో ఆరు సిక్సర్లు బాది రికార్డు క్రియేట్ చేశాడు. 1985లో బాంబే జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తూ బరోడాతో జరిగిన మ్యాచ్‌లో ఆరు బంతులను స్టాండ్స్‌లోకి పంపి ఆ ఘనతను రవిశాస్త్రి సృష్టించాడు. ఈ రికార్డు కొన్ని దశాబ్దాలుగా భద్రగా ఉంది. ఆ తర్వాత 2007 ప్రపంచ టీ20 కప్ సమయంలో ఇంగ్లండ్ బౌలర్ స్టువర్డ్ బ్రాడ్ బౌలింగ్‌లో భారత ఆటగాడు యువరాజ్ సింగ్ ఆరు బంతులను సిక్స్‌లుగా మలిచాడు. ఇది అంతర్జాతీయ క్రికెట్‌లో సరికొత్త రికార్డుగా నమోదైంది. 
 
అయితే, అండర్ 23 జాతీయ టోర్నీ అయిన కల్నల్ సీకే నాయుడు ట్రోఫీలో వంశీకృష్ణ ఈ ఘనతను సాధించాడు. ఈ వీడియోను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసి, సిక్స్ సిక్సెస్ ఇన్ ఏ ఓవర్ అలెర్ట్ అంటూ రాసుకొచ్చింది. కడపలో జరిగిన మ్యాచ్‌లో రైల్వేస్ స్పిన్నర్ దమన్ దీప్ సింగ్ బౌలింగులో వంశీకృష్ణ ఆరు సిక్సర్లు బాదాడని పేర్కొంది. ఈ మ్యాచ్‌లో వంశీకృష్ణ 64 బంతుల్లో 110 పరుగులు చేశాడు. ఈ వీడియోను మీరు కూడా వీక్షించండి.