బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 23 జనవరి 2021 (16:14 IST)

ఆరుగురు యువ క్రికెటర్లకు ఆనంద్ మహీంద్రా అద్భుతమైన గిఫ్ట్‌

ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనలో భారత క్రికెట్ జట్టు చిరస్మరణీయమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సిరీస్‌లో భారత క్రికెట్ జట్టులోని  యువ క్రికెటర్లు అద్భుతంగా రాణించారు. ఈ యువ క్రికెటర్ల పట్టుదల, ప్రతిభ కారణంగానే ఆస్ట్రేలియాను వారి సొంతగడ్డపైనే చిత్తు చేశారు. ఫలితంగా నాలుగు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌ను 2-1 తేడాతో టీమిండియా కైవసం చేసుకుంది. దీంతో భారత క్రికెట జట్టుపై ప్రసంసల వర్షం కురుస్తోంది. 
 
ఈ క్రమంలో టీమిండియాలోని ఆరుగురు యువ క్రికెటర్లకు మహీంద్రా సంస్థ అధినేత ఆనంద్ మహీంద్రా అద్భుతమైన బహుమతులు ప్రకటించారు. 33 ఏళ్ల త‌ర్వాత ఆస్ట్రేలియాలో టెస్టు సిరీస్ గెల‌వ‌డంలో కీల‌క పాత్ర పోషించిన అరంగేట్ర కుర్రాళ్ల‌కు ఆ ల‌క్కీ ఛాన్స్ ద‌క్కింది. చ‌రిత్రాత్మ‌క రీతిలో సిరీస్‌ను కైవ‌సం చేసుకున్న ఆ ఆరుగురికి థార్ వాహ‌నాల‌ను ఇస్తున్న‌ట్లు మ‌హేంద్ర సంస్థ చైర్మన్ ఆనంద్ మ‌హేంద్ర తెలిపారు. 
 
వీరిలో హైద‌రాబాదీ స్పీడ్‌స్ట‌ర్ మ‌హ‌మ్మ‌ద్ సిరాజ్‌, శార్దూల్ ఠాకూర్‌, శుభ్‌మ‌న్ గిల్‌, న‌ట‌రాజ‌న్‌, న‌వ‌దీప్ సైనీ, వాషింగ్ట‌న్ సుంద‌ర్‌లు మ‌హేంద్ర ఎస్‌యూవీల‌ను గెలుచుకున్న‌వారిలో ఉన్నారు. అత్యంత ఉత్కంఠ‌భ‌రితంగా సాగిన ఆస్ట్రేలియా సిరీస్‌లో యువ భార‌త ఆట‌గాళ్లు ఇర‌గ‌దీశారు. గాయాల‌తో స‌త‌మ‌త‌మైన టీమ్‌ను యంగ్ ప్లేయ‌ర్లు ఆదుకున్న తీరు విరోచితం. ఈ ఒక్క సిరీస్‌లోనే ఆరుగురు ఆట‌గాళ్లు అరంగేట్రం చేశారు. బోర్డ‌ర్ గ‌వాస్క‌ర్ టెస్ట్ ట్రోఫీని భార‌త్ 2-1 తేడాతో కైవ‌సం చేసుకున్న విష‌యం తెలిసిందే. 
 
ఈ క్రమంలో శనివారం వ‌రుస ట్వీట్ల‌ు చేస్తూ వచ్చిన ఆనంద్ మ‌హేంద్ర మ‌న ఆట‌గాళ్లను తెగ మెచ్చుకున్నారు. భ‌విష్య‌త్తు త‌రాల వారికి ఆద‌ర్శంగా నిలిచార‌ని కీర్తించారు. అసాధ్యాల‌ను సుసాధ్యం చేసే రీతిలో మ‌నోళ్లు ఆడిన‌ట్లు మ‌హేంద్ర త‌న ట్వీట్‌లో తెలిపారు. 
 
అద్భుతం సాధించే దిశ‌లో ఉద్భ‌వించిన నిజ‌మైన క‌థ‌ల‌ని, ఆ ఆట‌గాళ్లు అంద‌రి జీవితాల్లోనూ ప్రేర‌ణ‌గా నిలిచార‌ని, సిరీస్‌లో అరంగేట్రం చేసిన ఆట‌గాళ్ల‌కు కొత్త థార్ ఎస్‌యూవీల‌ను గిఫ్ట్‌గా ఇస్తున్న‌ట్లు మ‌హేంద్ర పేర్కొన్నారు. 
 
అయితే ఆ వాహ‌నాల‌ను త‌న స్వంత ఖ‌ర్చుల కింద ఇస్తున్న‌ట్లు చెప్పారు. ఇది కంపెనీ ఖ‌ర్చు కింద‌కు రాద‌న్నారు. యువ‌తలో విశ్వాసం నింపిన ఆట‌గాళ్ల‌కు గిఫ్ట్ ఇస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. టెస్ట్ సిరీస్‌లో సిరాజ్ అత్య‌ధికంగా 13 వికెట్లు తీసుకున్నాడు. బ్రిస్బేన్ టెస్టులో శార్దూల్‌, వాషింగ్ట‌న్‌లు కీల‌క ఇన్నింగ్స్ ఆడారు.