గురువారం, 19 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 31 ఆగస్టు 2022 (23:07 IST)

ఆసియా కప్ : క్రికెట్ పసికూనపై రోహిత్ సేన ఘన విజయం

rohit - kohli
ఆసియా కప్ క్రికెట్ టోర్నీలోభాగంగా దుబాయ్ వేదికగా బుధవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో క్రికెట్ పసికూన హాంకాంగ్‌‍పై భారత్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రోహిత్ సేన 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 192 పరుగులుచేసింది. ఆ తర్వాత 193 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన హాంకాంగ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. దీంతో భారత్ 40 పరుగుల తేడాతో విజయభేరీ మోగించింది. ఈ విజయంతో సూపర్-4లో అడుగుపెట్టిన రెండో జట్టుగా భారత్ నిలిచింది. ఇప్పటికే ఆప్ఘనిస్తాన్ జట్టు సూపర్-4కు దూసుకెళ్లిన విషయం తెల్సిందే. 
 
కాగా, హాంకాంగ్ జట్టులో కెప్టెన్ నిజాకత్ ఖాన్ 10, యాసిమ్ ముర్తాజా 9, బాబర్ హయత్ 41, కించిత్ షా 30, అజీజ్ ఖాన్ 14, జీసన్ అలీ 24 (నాటౌట్), స్టాక్ మెక్‌కిచ్నీ 16 (నాటౌట్) చొప్పున పరుగులు చేశారు. హయత్, షాలు మాత్రమే చెప్పుకోదగిన స్కోరు చేశారు. వీరిద్దరు భారత బౌలింగ్‌కు ఎదురొడ్డి బ్యాటింగ్ చేశారు. ఫలితంగా హాంకాంగ్ ఆమాత్రం పరుగులను సాధించగలిగింది. భారత బౌలర్లలో భువనేశ్వర్, అర్షదీప్, జడేజా, ఆవేష్ ఖాన్‌లు ఒక్కో వికెట్ తీయగా, మరో వికెట్‌ రనౌట్ రూపంలో లభించింది. 
 
అంతకుముందు, తొలుత టాస్ గెలిచిన హాంకాంగ్ జట్టు ప్రత్యర్థి భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. దీంతో బ్యాటింగ్ చేపట్టిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్‌లు అర్థ సెంచరీలతో రెచ్చిపోయారు. 
 
ఈ మ్యాచ్‌లో ఓపెనర్లుగా బరిలోకి దిగిన కెప్టెన్ రోహిత్ శర్మ 13 బంతుల్లో ఓ సిక్స్‌ సాయంతో 21 పరుగులు చేయగా, మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ 39 బంతుల్లో రెండు సిక్స్‌ల సాయంతో 36 పరుగులు చేశారు. తొలి వికెట్ జట్టు స్కోరు 36 పరుగుల వద్ద రోహిత్ రూపంలో కూలింది. ఆ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన కోహ్లీ.. రాహుల్‌కు పూర్తిగా సహకారమందిస్తూ క్రీజ్‌లో కుదురుకునేందుకు ప్రయత్నించాడు. 
 
ఈ క్రమంలో రెండో వికెట్ 94 పరుగుల వద్ద పడింది. ఆ తర్వాత కోహ్లీతో జతకలిసి సూర్యకుమార్ యాదవ్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. హాంకాంగ్ బౌలర్లను ఊచకోత కోస్తూ పరుగుల వద్ద పారించాడు. కేవలం 26 బంతుల్లో ఆరు సిక్స్‌లు, ఆరుఫోర్ల సాయంత్ర 68 పరుగులు చేశాడు. 
 
అలాగే, కోహ్లీ కూడా 44 బంతుల్లో మూడు సిక్స్‌లు ఓ ఫోర్ సాయంతో 59 రన్స్ చేశాడు. ఫలితంగా 20 ఓవర్లలో 2 వికెట్లను కోల్పోయి 192 పరుగులు చేశాడు. ఇందులో ఎక్స్‌ట్రాల రూపంలో 8 పరుగులు ఉన్నాయి. హాంకాంగ్ బౌలర్లలో అయుష్ శుక్లా, మహ్మద్ గజన్‌ఫర్‍‌లు ఒక్కో వికెట్ చొప్పున తీశారు. 
 
ఈ విజయంతో భారత్ సరికొత్త రికార్డును నెలకొల్పింది. ఆసియా కప్ టోర్నీలో వరుసగా 14 మ్యాచ్‌లలో విజయం సాధించింది.