ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 7 జూన్ 2023 (09:26 IST)

ఆసియా కప్ టోర్నీ నుంచి పాకిస్థాన్ దూరం?

asia cup
ఆసియా కప్ టోర్నీ నుంచి పాకిస్థాన్ వైదొలిగనుంది. ఆ మేరకు ఆ జట్టు యాజమాన్యం నుంచి సంకేతాలు వస్తున్నాయి. తాము ప్రతిపాదించిన హైబ్రిడ్‌ విధానాన్ని శ్రీలంక, బంగ్లాదేశ్‌, ఆప్ఘనిస్తాన్ వ్యతిరేకించడంతో ఆసియా కప్‌కు దూరంగా ఉండాలన్న నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. అయితే, ఈ విషయంలో పాక్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) మల్లగుల్లాలు పడుతోంది. 
 
నిజానికి ఈ యేడాది సెప్టెంబరులో ఆసియా కప్‌కు పాక్‌ ఆతిథ్యమివ్వాల్సింది. భద్రత కారణాల వల్ల పాక్‌లో పర్యటించేందుకు భారత్‌ నిరాకరించింది. దీంతో టీమ్‌ఇండియా మ్యాచ్‌ల్ని తటస్థ వేదికలో నిర్వహించేలా హైబ్రిడ్‌ విధానాన్ని పీసీబీ ప్రతిపాదించింది. 
 
కానీ.. టోర్నీని పాక్‌ నుంచి తరలించాలన్న బీసీసీఐ ఆలోచనకే శ్రీలంక, బంగ్లా, అప్ఘన్‌లు మద్దతు తెలపడంతో పీసీబీ ఆశలు గల్లంతయ్యాయి. 'పాక్‌ ముందు రెండే దారులు ఉన్నాయి. తటస్థ వేదికలో ఆడటం లేదా టోర్నీ నుంచి వైదొలగడం' అని ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ (ఏసీసీ) వర్గాలు తెలిపాయి.