బుధవారం, 22 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 5 సెప్టెంబరు 2023 (11:13 IST)

ఆసియా కప్ : సూపర్-4కు భారత్.. ఆదివారం పాకిస్థాన్‌తో పోరు

asia cup
ఆసియా కప్ క్రికెట్ టోర్నీలో భాగంగా సోమవారం క్రికెట్ పసికూన నేపాల్‌ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో భారత్ 10 వికెట్ల తేడాతో విజయభేరీ మోగించింది. దీంతో సూపర్ ఫోర్‌లోకి ప్రవేశించింది. ఫలితంగా వచ్చే ఆదివారం చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో తలపడనుంది. 
 
శ్రీలంకలోని పల్లెకెలెలో జరిగిన ఈ గ్రూప్-ఏ పోరులో టాస్ గెలిచిన భారత్... నేపాల్‌కు బ్యాటింగ్ అప్పగించింది. నేపాల్ 48.2 ఓవర్లలో 230 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం టీమిండియా లక్ష్యఛేదనలో వర్షం అంతరాయం కలిగించడంతో లక్ష్యాన్ని కుదించారు. డక్ వర్త్ లూయిస్ విధానంలో భారత్ లక్ష్యాన్ని 23 ఓవర్లలో 145 పరుగులుగా నిర్దేశించారు.
 
భారత్ ఈ లక్ష్యాన్ని 20.1 ఓవర్లలో ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా ఛేదించింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్ మాన్ గిల్ ఏమంత అనుభవం లేని నేపాల్ బౌలర్లను ఆడుకున్నారు. ముఖ్యంగా రోహిత్ శర్మ సిక్సర్ల మోత మోగించాడు. మరో ఎండ్‌లో శుభ్ మాన్ గిల్ కూడా దూకుడుగా ఆడాడు. ఈ జోడీని విడదీయడం నేపాల్ బౌలర్ల వల్ల కాలేదు.
 
రోహిత్ శర్మ 59 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సులతో 74 పరుగులు చేయగా, గిల్ 62 బంతుల్లో 67 పరుగులు చేశాడు. గిల్ 8 ఫోర్లు, 1 సిక్స్ బాదాడు. చివర్లో గిల్ ఫోర్ కొట్టి మ్యాచ్‌ను ముగించాడు. పాపం, నేపాల్ బౌలర్లు ఒక్క వికెట్ కూడా తీయలేక ఉసూరుమనిపించారు.
 
ఈ విజయంతో భారత్ సూపర్-4 దశలోకి ప్రవేశించింది. గ్రూప్-ఏ నుంచి పాకిస్థాన్ కూడా సూపర్-4లో అడుగుపెట్టింది. కాగా, గ్రూప్ దశలో భారత్, పాక్ మ్యాచ్ వర్షార్పణం కాగా, సూపర్-4 దశలో దాయాది జట్లు మరోసారి తలపడనున్నాయి. గ్రూప్-ఏలో టాపర్‌గా నిలిచిన పాక్... రెండో స్థానంలో నిలిచిన భారత్ సెప్టెంబరు 10న కొలంబోలో తలపడనున్నాయి.
 
గ్రూప్-ఏలో భారత్, పాక్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దవడంతో ఇరుజట్లకు చెరో పాయింట్ కేటాయించారు. అంతకుముందు పాక్ జట్టు నేపాల్‌పై గెలుపొందింది. ఇప్పుడు భారత్ కూడా నేపాల్‌పై విజయం సాధించింది. దాంతో భారత్, పాక్ ఖాతాలో చెరో 3 పాయింట్లు ఉన్నాయి. రన్ రేట్ మెరుగా ఉండడంతో గ్రూప్‌లో పాక్ అగ్రస్థానం దక్కించుకుంది. ఫలితంగా భారత్‌ వర్సెస్ పాక్ మ్యాచ్‌ జరుగనుంది.