శనివారం, 4 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 21 జనవరి 2021 (21:48 IST)

రిషబ్ పంత్ కాదు.. స్పైడర్‌ పంత్‌.. ఐసీసీ ప్రశంసలు

Spider
కంగారూలపై రిషభ్ పంత్ హీరోయిక్స్‌తో భారత జట్టు టెస్టు క్రికెట్‌ చరిత్రలో గొప్ప విజయాన్ని అందుకుంది. ఆస్ట్రేలియాతో మంగళవారం ముగిసిన చివరి టెస్టులో భారత్‌ 3 వికెట్ల తేడాతో విజయం సాధించి 2-1 తేడాతో బోర్డర్‌-గావస్కర్‌ ట్రోఫీని గెలుచుకుంది. 328 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 7 వికెట్ల నష్టానికి 329 పరుగులు చేసింది. 'ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' గా రిషబ్ పంత్‌ నిలిచాడు. దీంతో పంత్ పై ప్రముఖల నుంచి ప్రశంసల వర్షం కురుస్తోంది. 
 
ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా గడ్డపై గర్జించిన యంగ్ డైనమైట్ బ్యాట్స్‌మన్‌ను పొగడ్తలతో ముంచెత్తింది ఐసీసీ. రిషభ్‌ పంత్ కాదు.. స్పైడర్‌ పంత్‌ అని పేర్కొంటూ ఓ ట్వీట్‌ చేసింది. అంతేకాదు అతనిపై ఓ పాట కూడా రూపొందించింది.
 
చివరి టెస్ట్ నాలుగో రోజు ఆటలో భాగంగా ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌ సందర్భంగా కెప్టెన్‌ టిమ్‌ పైన్ బ్యాటింగ్‌ చేస్తుండగా.. రిషభ్ పంత్‌ కీపింగ్‌ చేస్తున్నాడు. ఆ సమయంలో పంత్ 'స్పైడర్‌ మ్యాన్‌' సినిమా లిరిక్‌ను పాడుకున్నాడు. దానికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.  
 
మరోవైపు అంతర్జాతీయ క్రికెట్​ కౌన్సిల్(ఐసీసీ) విడుదల చేసిన తాజా టెస్టు క్రికెట్​ ర్యాంకింగ్స్‌లో గబ్బా టెస్ట్ హీరో రిషభ్ పంత్ సత్తా చాటాడు. గబ్బాలో గర్జించిన ఈ టీమిండియా వికెట్ కీపర్ కెరీర్ బెస్ట్ ర్యాంకును అందుకున్నాడు. ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో 13వ స్థానంలో నిలిచాడు రిషబ్. 
 
అలాగే బ్రిస్బేన్ టెస్ట్‌లో సరికొత్త రికార్డు సృష్టించాడు. ఈ రికార్డుతో అతడు లెజెండరీ వికెట్ కీపర్ ఎమ్మెస్ ధోనీని మించిపోయాడు. టెస్టుల్లో అత్యంత వేగంగా 1000 పరుగుల మైలురాయిని చేరుకున్న ఇండియన్ వికెట్ కీపర్‌గా పంత్ నిలిచాడు.