బుధవారం, 17 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 29 డిశెంబరు 2020 (09:27 IST)

మెల్‌బోర్న్ టెస్ట్ : ఆసీస్ 200 రన్స్‌కే ఆలౌట్.. భారత్‌ విజయభేరీ - సిరీల్ లెవల్

మెల్‌బోర్న్ టెస్టులో భారత్ విజయం ముంగిటనిలిచింది. బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో భాగంగా మెల్‌బోర్న్‌లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు తన రెండో ఇన్నింగ్స్‌లో 200 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో భారత్ ముంగిట 70 పరుగుల విజయలక్ష్యాన్ని ఉంచింది. ఈ లక్ష్యాన్ని ఛేదించేందుకు మరో రోజు ఆటకూడా మిగిలివుంది. అయితే, అడిలైడ్ వేదికగా జరిగిన తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో భారత్ కేవలం 30 పైచిలుకు పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో ఇపుడు ఆస్ట్రేలియా నిర్దేశించిన 70 పరుగుల విజయలక్ష్యాన్ని టీమిండియా ఛేదిస్తుందా? లేదా? అన్న సందేహం నెలకొంది. 
 
మూడో రోజు ఓవర్ నైట్ స్కోరు ఆరు వికెట్ల నష్టానికి 133 పరుగులతో నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా మరో 67 పరుగులు మాత్రమే జోడించి చివరి నాలుగు వికెట్లను కోల్పోయింది. ఆసీస్ ఆటగాళ్లలో ఓపెనర్లలో బర్న్స్ 4, వాడే 40 పరుగులు చేయగా, లుబ్సజ్ఞే 28, స్మిత్ 8, హెడ్ 17, గ్రీన్ 45, పైనే 1, కమ్మిన్స్ 22, మిచెల్ స్టార్క్ 14 (నాటౌట్), నాథన్ లియాన్ 3, హాజల్‌వుడ్ 10 చొప్పున పరుగులు చేయగా, ఎక్స్‌ట్రాల రూపంలో 8 రన్స్ వచ్చాయి. భారత బౌలర్లలో మహ్మద్ సిరాజ్ మూడు వికెట్లు పడగొట్టగా, బుమ్రా, అశ్విన్, జడేజాలు చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. ఉమేశ్ యాదవ్‌కు ఓ వికెట్ దక్కింది. 
 
అంతకుముందు భారత జట్టు తన తొలి ఇన్సింగ్స్‌లో 326 పరుగులు చేసింది. రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ గైర్హాజరీలో జట్టు సారథ్య బాధ్యతలు చేపట్టిన అజింక్య రహానే సెంచరీతో (112) జట్టును పటిష్ట స్థితిలోకి చేర్చాడు. శుభ్‌మన్ గిల్ 45, రవీంద్ర జడేజా 57 పరుగులతో ఆకట్టుకున్నారు. అలాగే, ఆస్ట్రేలియా జట్టు కూడా తన తొలి ఇన్నింగ్స్‌లో 195 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో భారత్‌కు తన తొలి ఇన్నింగ్స్‌లో 131 పరుగుల కీలకమైన ఆధిక్యం దక్కిన విషయం తెల్సిందే.