భారత క్రికెటర్ల కోసం చార్టెడ్ ఫ్లైట్.. ఖర్చు రూ.3.50 కోట్లు
భారత క్రికెట్ జట్టు ఇపుడు ఇంగ్లండ పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటన ముగిసిన తర్వాత వెస్టిండీస్‌కు బయలుదేరి వెళతారు. ఆ దేశ జట్టుతో మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లలో టీమిండియా తలపడుతుంది. అయితే, ఇంగ్లండ్ నుంచి విండీస్‌కు వెళ్లేందుకు భారత క్రికెటర్ల కోసం భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ఆఫ్ ఇండియా (బీసీసీఐ) ఒక చార్టెడ్ ఫ్లైట్‌ను బుక్ చేసింది. ఇందుకోసం రూ.3.50 కోట్లను వెచ్చించనుంది.
ఇంగ్లండ్‌తో మాంచెస్టర్ వేదికగా జరిగే చివరి వన్డే తర్వాత భారత క్రికెట్ జట్టు అక్కడ నుంచి వెస్టిండీస్‌కు బయలుదేరి వెళుతుంది. ఇందుకోసం బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. దీనికి కారణం లేకపోలేదు.
ఒకవైపు ఆటగాళ్లకు కరోనా వైరస్ సోకుందన్న భయంతో పాటు మరోవైపు, క్రికెటర్లు, వారి భార్యాపిల్లలు, సహాయక సిబ్బంది ఉన్నారు. వీరందరినీ వేర్వేరు విమానాల్లో కరేబియన్ దీవులకు తరలించాలంటే తలకుమించిన పని. పైగా, అతి తక్కువ సమయంలో విమాన టిక్కెట్లు కొనుగోలు చేయడం సాధ్యం కాదు. అందుకే బీసీసీఐ ఈ తరహా నిర్ణయాన్ని తీసుకుని ఏకంగా చార్టెడ్ ఫ్లైట్‌ను బుక్ చేసింది.