ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 11 మే 2023 (11:11 IST)

బీసీసీఐకు కాసుల వర్షం.. ఐసీసీ నుంచి రూ.9424 కోట్ల ఆదాయం

bcci
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ)కు కాసుల వర్షం కురిసింది. 2023 నుంచి 2027 వరకు ఐదేళ్ల కాలానికి అంతర్జాతీయ క్రికెక్ మండలి (ఐసీసీ) నుంచి సుమారు రూ.9,424 కోట్ల ఆదాయంలో వాటాగా బీసీసీఐ పొందనుంది. అంటే ఐసీసీ ఆదాయం (సుమారు రూ.24 వేల కోట్లు)లో దాదాపు 38.50 శాతం బీసీసీఐ ఖాతాలో చేరనుంది. అయితే, దీనిపై ఇంతవరకు ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ త్వరలోనే ఈ ప్రతిపాదన ఆమోదం పొందుతుందని ఓ ఐసీసీ సభ్యుడు తెలిపాడు. 
 
ఏడాదికి ఐసీసీకి రూ.4,918 కోట్లు ఆదాయం రానుందని అంచనా. క్రికెట్‌లో ర్యాంకింగ్‌, ఐసీసీ టోర్నీల్లో ప్రదర్శన, ఆటకు వాణిజ్య సహకారం తదితర విషయాలను పరిగణలోకి తీసుకుని కొత్త ఆర్థిక విధానం ప్రకారం ఆదాయంలో సభ్య దేశాలకు వాటా ఇవ్వనున్నారు. దీని ప్రకారం చూసుకుంటే ఇంగ్లాండ్‌కు 6.89 శాతం, ఆస్ట్రేలియాకు 6.25 శాతం, పాకిస్థాన్‌కు 5.75 శాతం ఆదాయంలో వాటా దక్కే అవకాశముంది. 
 
భారత్‌కు మాత్రం గరిష్టంగా 38.50 శాతం మేరకు ఆదాయ వాటా రానుంది. గత 2018 నుంచి 2022 వరకు ఐసీసీ నుంచి 26 శాతం వాటాను బీసీసీఐ పొందింది. కానీ ఇప్పుడు ఐసీసీలో శక్తిమంతమైన ఆర్థిక, వాణిజ్య వ్యవహారాల విభాగానికి బీసీసీఐ కార్యదర్శి జై షా అధ్యక్షుడిగా ఉండడంతో ఈ సారి ఆదాయంలో మన వాటా పెరిగే సూచనలు అధికంగా ఉన్నాయని క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.